24 గంటల్లో 13,856 కేసులు

by  |
24 గంటల్లో 13,856 కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్.. ఇలా ప్రముఖ నగరాల్లో ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడంలేదు. రోజురోజుకూ కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎప్పుడూ లేనంత భారీ స్థాయిలో కేవలం 24 గంటల్లోనే 13,856 పాజిటివ్ కేసులు దేశం మొత్తం మీద నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,80,532కు చేరింది. ఒక్కరోజే కరోనాతో 336 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 12,573కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 2,04,710 మంది కోలుకోగా 1,63,248 మంది ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

టెస్టుల సంఖ్య పెంచుతున్నాకొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ నగరంపై ఫోకస్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం రోజుకు 18 వేల చొప్పున టెస్టులు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి ఆదేశిస్తే పూలింగ్ టెస్టులు చేయాల్సిందిగా కేంద్ర వైద్యారోగ్య మంత్రి సూచించారు. లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వస్తుందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ టెస్టుల్ని నిర్వహించాలనుకుంటోంది. దాంట్లో భాగంగా అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసి టెస్టుల సంఖ్యను పెంచాల్సిందిగా సూచించింది. తెలంగాణలో సైతం టెస్టుల సంఖ్య పెరిగింది.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. మహారాష్ట్రలో ఒక్కరోజే 3,827 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదైనట్లయింది. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,24,331కి చేరింది. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 142 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,269పాజిటివ్ కేసులు నమోదుకాగా, 114 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 64,068కి చేరగా, 3,423 మంది చనిపోయారు.

తమిళనాడులో ఒక్కరోజే 2,115 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 54,449కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 41 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 6,66కి చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 540 కొత్త పాజిటివ్‌లు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26,198కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే 27 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1619కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 376కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 6,230కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా నలుగురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 96 మంది మరణించారు.



Next Story