‘కరోనా’ బ్యాచ్‌‌కు పరీక్షలు.. జాగ్రత్త!

by  |
‘కరోనా’ బ్యాచ్‌‌కు పరీక్షలు.. జాగ్రత్త!
X

దిశ, తెలంగాణ బ్యూరో : పదో తరగతి, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఈసారి పరీక్షలు రాయడం తప్పనిసరి కానుంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ ఏడాది ‘ఆల్ పాస్’ విధానం ఉండకపోవచ్చని తెలిసింది. కచ్చితంగా పరీక్షలు రాయడంతోపాటు వచ్చిన మార్కులే ప్రామాణికంగా ఉండనున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. జేఈఈ పరీక్షలకు సిలబస్ తగ్గించే ఆలోచన లేదని కేంద్ర హెచ్చార్డీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా సిలబస్ తగ్గించకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్‌కు మాత్రమే కాక పదవ తరగతి విషయంలోనూ సిలబస్ తగ్గించే అవకాశం లేదని తెలిసింది. పదో తరగతికి మాత్రం రెగ్యులర్‌గా ఉండే 11 ప్రశ్నాపత్రాలకు బదులుగా ఈసారి ఆరు మాత్రమే ఉంటాయనేది దాదాపు ఖరారైంది.

కేంద్రం దారిలో

జేఈఈ పరీక్షలను కేంద్రం ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించనుంది. దానికి విద్యార్థులు కనీస స్థాయిలో ప్రిపేర్ కావడానికి నెల రోజులు పడుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో రెవెన్యూ, వైద్యారోగ్య, విద్యా శాఖ అధికారులతో చర్చించిన తర్వాత తుది ప్రకటన చేయనున్నారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రస్తుతం నడుస్తున్న ఆన్‌లైన్ తరగతులను కొనసాగిస్తూనే ఫిజికల్ క్లాసులు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఫిజికల్ తరగతులకు హాజరుకావడానికి తల్లిదండ్రుల నుంచి అనుమతి, ఆమోదం తప్పనిసరి కానుంది. వారి సమ్మతితోనే విద్యార్థులు ఫిజికల్ తరగతులకు హాజరు కావాలి.

ఏప్రిల్, మేలో పరీక్షలు

జేఈఈ తొలి విడత పరీక్ష ఫిబ్రవరి 23న జరగనుంది. దీనికి సిద్ధం కావాలంటే విద్యార్థులు కనీసం నెల రోజులపాటు తరగతులకు హాజరు కావాలి. కోచింగ్, ప్రత్యేక క్లాసులకు వెళ్లి ప్రిపేర్ కావాల్సి ఉన్నందున సంక్రాంతి తర్వాత ఫిజికల్ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారుల సమాచారం. కరోనా కారణంగా ఈసారి విద్యా సంవత్సరంపై స్పష్టత లేకపోవడం, ఆన్‌లైన్ తరగతులు మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభం కావడం, రెగ్యులర్ క్లాసుల తరహాలో విద్యార్థులకు లోతైన పరిజ్ఞానం అందకపోవడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని వార్షిక పరీక్షలకు ముందు కనీసం మూడు నెలల పాటు ఫిజికల్ తరగతులు ఉంటే మంచిదన్న అభిప్రాయం ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమైంది. దానికి అనుగుణంగానే సంక్రాంతి తర్వాత ఫిజికల్ తరగతులు మొదలైతే ఏప్రిల్ మూడో వారం లేదా మే నెలలో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిసింది.

సీఎం నిర్ణయం తీసుకోవాలి

కరోనా నేపథ్యంలో ఫిజికల్ తరగతులపై విపత్తు నిర్వహణ విభాగం స్పష్టమైన ప్రకటనను వెలువరించాల్సి ఉంది. రెవెన్యూ పరిధిలో పనిచేసే విభాగం అయినందున ఆ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫిజికల్ తరగతుల కారణంగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు నుంచి స్కూళ్లు ప్రారంభమైన తర్వాత వైరస్ కేసులు పెరిగాయి. ఆ తర్వాత అదుపులోకి వచ్చాయి. మరో ఆరు రాష్ట్రాల్లో సైతం ఇప్పటికే ఫిజికల్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.



Next Story

Most Viewed