లక్ష ఎకరాల నిర్లక్ష్యం.. రూ.100 కోట్ల నష్టం

by  |
లక్ష ఎకరాల నిర్లక్ష్యం.. రూ.100 కోట్ల నష్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూవివాదాలకు సర్వరోగ నివారిణి అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లో తప్పులను సరి చేయని కారణంగా అక్రమార్కులకు రైతుబంధు సాయం అందుతోంది. దీంతో సర్కారుకు ఏటా రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా రికార్డులలో మార్పులు జరగలేదు. ప్రక్షాళనలోనూ సవరణలు చేయలేదు. అందుకే అర్హతలేనివారి ఖాతాలలో రైతుబంధు సొమ్ము పడుతున్నట్లు తెలుస్తోంది. తప్పుల తడకగా ఉన్న రికార్డులతోనే రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారు. ఈ భారం కూడా రాష్ట్ర ఖజానాకు పెద్దదే. కరోనా కష్ట కాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది. అక్రమార్కులకు అందకుండా రికార్డులను సరి చేయాలన్న ఆలోచన మాత్రం రాలేదన్న విమర్శలొస్తున్నాయి. రైతుబంధు పథకం నిధుల దుర్వినియోగం ఎంత వరకు నిజమని అడిగితే అక్రమ లే అవుట్లు, ప్లాట్లు, భవనాల లెక్కను చూపిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 25 లక్షల పైమాటే. దరఖాస్తు చేసుకోని వారి సంఖ్య కూడా 20 లక్షల పైమాటేనని అంచనా. ఈ లెక్కన లక్షన్నర ఎకరాల భూమి వ్యవసాయేతర భూమిగా మారింది. నాలా కన్వర్షన్ చేసుకున్న భూమి 20 శాతం కూడా లేదని రెవెన్యూ అధికారులు అంగీకరిస్తున్నారు. రికార్డులలోకి ఎక్కని నాలా కన్వర్షన్ భూములు కూడా చాలానే ఉన్నట్లు చెబుతున్నారు. లక్ష ఎకరాలకు పైగానే వ్యవసాయ భూములుగా ధరణిలో నమోదు చేశారని తెలుస్తోంది.

ఇష్టానుసారంగా వెంచర్లు

ప్రతి పల్లెలోనూ సాగు భూమిని ప్లాట్లుగా విభజించారు. మండల, జిల్లా కేంద్రాలలో చాలా వరకు అనుమతులు లేకుండానే, నాలా కన్వర్షన్ చేయకుండానే వెంచర్లు వేశారు. కొన్ని ప్రాంతాలలో నాలా కన్వర్షన్ చేసుకొని డీటీసీపీ లేదా హెచ్ఎండీఏ నుంచి అనుమతి లేకుండా లే అవుట్లు చేశారు. నాలా కన్వర్షన్ చేసిన భూములు కూడా సాగు భూములుగా కొనసాగుతున్నాయని ఉద్యోగులే నిర్ధారిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ చేసిన ప్లాట్లకు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బంధువులకే అలాంటి పాస్ పుస్తకం ఉంది. దానికి రైతుబంధు కూడా ఇస్తున్నారు. ప్లాట్ల యజమానులు మూడేండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. అందులో కొన్నింటికి ఎల్ఆర్ఎస్ సర్క్యూలర్ కూడా జారీ చేశారు. ఇంకొందరు బ్యాంకులలో రుణాలు పొందారు. హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వాటి చుట్టూ ఉన్న గ్రామాలలోని లే అవుట్లు కూడా సాగు భూములుగా ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి. నగరానికి దూరంగా ఉన్న జిల్లా, మండల కేంద్రాలు, వాటి చుట్టూ ఉన్న పల్లెల లే అవుట్లల్లో 90 శాతం అగ్రికల్చర్ భూములుగానే ధరణిలో ఉన్నాయని తెలుస్తోంది.

సేకరించిన భూములలోనూ

ఎస్సారెస్పీతోపాటు, ఇతర పథకాల కోసం పలుచోట్ల భూసేకరణ చేసారు. ధరణిలో పీఎంఎస్ డేటా సరిగా నమోదు చేయకపోవడంతో ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరంగల్ జిల్లాలోనూ కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూములను నేటికీ కొందరు సాగు చేస్తున్నారు. ఇంకా అనేక సాగు నీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల కింద సేకరించిన భూములను రికార్డులలో ఏ మేరకు మార్చారన్న విషయాన్ని మరోసారి సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జిల్లాలలో వేలాది ఎకరాలు సేకరించారు. పరిహారం చెల్లించారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం, సిబ్బందిలేమితో రికార్డులు మారడం లేదు. వాటిని సవరించకపోతే మరో ఏడాది పెద్ద మొత్తం నష్టపోయే అవకాశం ఉంది.

ఎల్ఆర్ఎస్ వివరాలు
‌‌
= ఎల్ఆర్ఎస్ కోసం అందిన దరఖాస్తుల సంఖ్య: 25 లక్షలు
= ప్లాటు సగటున 150 గజాల చొప్పున మొత్తం విస్తీర్ణం: 37,50,00,000 చ. గజాలు (77,480 ఎకరాలు)
= దరఖాస్తు చేసుకోని ప్లాట్ల సంఖ్య సుమారు: 20 లక్షలు
= ప్లాటు సగటున 150 గజాల చొప్పున మొత్తం విస్తీర్ణం: 30,00,00,000 చ.గజాలు (61,983 ఎకరాలు)
= ప్లాట్లుగా మారిన భూమి: 1,39,463 ఎకరాలు
= ఇందులో 25 శాతం వరకు ప్లాట్లుగా రాసినట్లు అంచనా
= ఇంకా లక్ష ఎకరాలకు పైగానే సాగు భూమిగా ఉంది.

రైతుబంధు లబ్ధిదారులు
‌‌
= పట్టాదారుల సంఖ్య: 60,95,134
‌‌= 2.20 ఎకరాల లోపు ఉన్నవారు: 39,52,232
‌‌= 2.20 నుంచి 3 ఎకరాలు ఉన్నవారు: 4,70,759
‌‌= 3 నుంచి 5 ఎకరాలు ఉన్నవారు: 11,08,193
‌‌= 5 నుంచి 7.20 ఎకరాలు ఉన్నవారు: 3,49,382
‌‌= 7.20 నుంచి 10 ఎకరాలు ఉన్నవారు: 1,15,916

Next Story

Most Viewed