బడ్జెట్ డేటా అంటే మా(ఆ)టలా?

by  |
బడ్జెట్ డేటా అంటే మా(ఆ)టలా?
X

వివాదంలోనైనా తమ వాదాన్ని నిరూపించుకునేందుకు డేటాపైనే ఆధారపడతాం. తప్పొప్పులను విప్పిచెప్పాలంటే నిజానిజాలను తేల్చే సమాచారం తప్పనిసరి. అలాగే, లక్ష్య సాధనలో ఇప్పుడెక్కడున్నామో సమీక్షించుకునేందుకు డేటా అత్యంతక కీలకం. అందుకే అభిప్రాయాల కంటే డేటాకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాదు, అభివృద్ధిపథాన పురోగమించడానికి ఒక ప్రభుత్వానికి లేదా ఒక కంపెనీకి డేటానే ఇంధనం అన్న వాదన అంతర్జాతీయంగా బలంగా వినపడుతున్నది. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ‘డేటా కచ్చితంగా బలమైన విశ్వసనీయతను కలిగి ఉండాలని, సమాచారమే కొత్త ఇంధనం’ అని వ్యాఖ్యానించారు.

కానీ, కేంద్ర బడ్జెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన గణాంకాల్లో లోపాలున్నట్టు వెలుగులోకి వచ్చాయి. ఈ వెబ్‌సైట్‌లో కేటాయింపులను రెండు ఫార్మాట్‌లు పీడీఎఫ్, ఎక్సెల్ షీట్‌లలో కేంద్ర ప్రభుత్వం పొందుపరించింది. ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన బడ్జెట్ కేటాయింపుల్లోని లోపాలను ఓ జాతీయ మీడియా సంస్థ గుర్తించింది. పీడీఎఫ్‌లోని గణాంకాలకు, ఎక్సెల్ షీట్‌లోని గణాంకాలకు పొంతన లేదని గుర్తించింది. ఒక్క ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించినట్టు పేర్కొన్న గణాంకాల్లోనే 14 లోపాలను ఆ మీడియా సంస్థ గుర్తించింది. ఉదాహరణకు.. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి నిధుల కేటాయింపు పీడీఎఫ్‌లో రూ. 1,318.86 కోట్లు ఉండగా.. ఎక్సెల్ ఫైల్‌లో రూ. 1,166.86 కోట్లుగా పొందుపరిచారు.

ఈ రెండింటిలో ఏ ఫార్మాట్‌లోని గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న సంశయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించలేదు. కానీ, తర్వాతి రోజే ఆ అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ గణాంకాలతో సరిపోయే వివరాలున్న ఎక్సెల్‌షీట్ అప్‌లోడ్ అయింది.

క్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అభివృద్ధికర పనులు, వాటి పురోగతి, ప్రజల ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను వివరించే ఆర్థిక సర్వేకు విశేష ప్రాధాన్యముంది. బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టే ఈ సర్వేలోని అవసరమైన సలహాలు, సూచనలను కేంద్ర సర్కారు (ఐచ్ఛికం) స్వీకరిస్తుంటుంది. కానీ, ఈసారి రూపొందించిన ఆర్థిక సర్వేపైనా పలు విమర్శలు వచ్చాయి. ఈ సర్వే కోసం ఆర్బీఐ, ఎన్ఎస్ఎస్ఓ, సిబిల్, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకలతోపాటు వికిపీడియా, ఇతర ప్రైవేటు సంస్థల నుంచీ సమాచారాన్ని తీసుకుంది. వికిపీడియా సమాచారాన్ని విశ్వసనీయంగా పరిగణించలేం. ఎందుకంటే వికిపీడియాలోని వ్యాసాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని వాలంటీర్లు ఎప్పుడైనా మార్చే అవకాశముంటుంది.

ఇప్పుడు ప్రభుత్వ డేటాలో లోపాలున్నట్టు కథనాలు వస్తున్నాయి. గతంలో అసలు డేటానే బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఆరోపణలను కేంద్రం ఎదుర్కొంది. రైతు ఆత్మహత్యలు, ఆకలి మరణాలు, నిరుద్యోగంపై సమాచారాన్ని కేంద్రం కావాలని బయటపెట్టలేదని ఆరోపణలు వచ్చాయి. వీటిని వివరించే ఎన్‌సీఆర్‌బి, ఎన్ఎస్ఎస్ఓ నివేదికలు సకాలంలో విడుదలకాని విషయం తెలిసిందే.

డేటా, అంచనాల వ్యవహారంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని గతంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ సూచించి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. 2024లోపు భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పరిణమించి తీరుతుందని, అందుకు డేటా, వృద్ధి రేటు లెక్కల్లోకి వెళ్లొద్దని మంత్రి పియూష్ గోయల్ గతంలో సూచించి ఆరోపణలెదుర్కొన్నారు. అభివృద్ధిని సమీక్షించేందుకు డేటా తప్పనిసరి. విశ్వసనీయమైన డేటాను పారదర్శకంగా ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed