కరోనా ‘కేసులు’ తగ్గాయి.. పరిశీలనలో గుర్తింపు

by  |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గినా, చికిత్స కాల వ్యవధి పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్​ రేట్​ కేవలం 0.41 శాతం ఉన్నా, రికవరీ సమయం రెట్టింపైంది. గతంలో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందిన వారిలో సుమారు 90 శాతం మంది సగటున 7 నుంచి 14 రోజుల్లో కోలుకోగా.. ఇప్పుడు 15 నుంచి 20 రోజుల వరకు ట్రీట్మెంట్​ తీసుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులతో బాధితుల్లో శ్వాస సమస్యలు పెరిగాయంటున్నారు. కరోనా ప్రభావంతో రోగ నిరోధక శక్తి క్షీణించడం వలనే సదరు పేషెంట్లలో సులువుగా శ్వాస సమస్యలు వస్తున్నాయని గాంధీ వైద్య బృందం పరిశీలనలో తేలింది.

మిగతా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్​ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తమ దృష్టికి వచ్చిందని గాంధీ సూపరింటెండెంట్​ ప్రో డా రాజారావు చెప్పారు. ట్రీట్మెంట్​ తీసుకుంటున్న వారిలో బ్రీతింగ్​ సమస్యతోనే ఎక్కువ రోజులు హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అలాంటి వారికి మందులతో పాటు ఆక్సిజన్, సి కాప్​ తదితర పరికరాలతో వైద్యం అందిస్తూ సాధారణ స్థాయికి తీసుకువస్తున్నామన్నారు. అంతేగాక అత్యవసరమైన వారికి వెంటిలేటర్​ ద్వారా కూడా ఆక్సిజన్​ అందిస్తున్నామన్నారు. కానీ బాధితుల్లో ఎవరూ సీరియస్​ పరిస్థితుల్లోకి వెళ్లడం లేదని వైద్యులు తేల్చిచెప్పారు.

ఆసుపత్రుల్లో ఎందుకు చేరాల్సి వస్తున్నది..?

శరీరంలో ఆక్సిజన్​ లెవల్స్​ 95 కంటే తక్కువ ఉండి, శ్వాసరేట్​ 25 కంటే ఎక్కువున్నప్పుడు సదరు బాధితుడు తప్పనిసరిగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకోవాలి. లేదంటే పరిస్థితి చేజారిపోతుంది. నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ ట్రీట్మెంట్​ ప్రోటోకాల్​ ను సమర్ధవంతంగా అనుసరించాలి. కొన్ని సందర్భాల్లో వెంటిలేటర్లపై కూడా చికిత్స పొందాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వైరస్ దాడికి ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. వాస్తవానికి శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్​ లను తరిమికొట్టేందుకు రోగ నిరోధక శక్తి సైటోకైన్స్ అనే కణాలను విడుదల చేస్తాయి. కానీ వీటి ఉత్పత్తి అవసరానికి మించి జరిగితే శరీరంలోని రక్తనాళాలతో పాటు ఊపిరితిత్తుల నాళాలపై కూడా దాడి జరుగుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లోనే బాధితులకు శ్వాస సమస్యలు వచ్చి ఎక్కువ రోజులు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడుతున్నది.

Next Story

Most Viewed