బీజేపీ రివర్స్ స్వింగ్.. స్థానిక ఎన్నికల్లో కాషాయానికే పెద్దపీట

by  |
amit shah, yogi adityanath
X

లక్నో : ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ సత్తా చాటింది. 75 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకుగాను 60 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మరోవైపు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో విజయం బీజేపీకి ఉత్సాహం ఇవ్వనుండగా సమాజ్‌వాదీ పార్టీకి నిరాశగా భావించవచ్చు. ‘75 జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్ సీట్లకుగాను 67 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే గెలవనున్నాం’ అని బీజేపీ యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ విలేకరులకు తెలిపారు.

ప్రయాగ్‌రాజ్(గతంలో అలహాబాద్) జిల్లా పరిషత్ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగగా పోలీసులు లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. బీజేపీ అభ్యర్థులు 21 మంది, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3,000 మంది జిల్లా పరిషత్ సభ్యులు 75 మంది చైర్‌పర్సన్‌లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మాయావతికి చెందిన బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయలేదు. 2016లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో 75 సీట్లకుగాను సమాజ్‌వాదీ పార్టీ 60 స్థానాల్లో విజయం సాధించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. కానీ, ఇది సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కొంత ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed