సొంత పార్టీ జడ్పీటీసీకి చైర్‌పర్సన్ వార్నింగ్.. పిచ్చి పిచ్చిగా వాగితే..!

by  |
సొంత పార్టీ జడ్పీటీసీకి చైర్‌పర్సన్ వార్నింగ్.. పిచ్చి పిచ్చిగా వాగితే..!
X

దిశప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం ఆందోళనతోనే ప్రారంభమైయింది. స్ధానిక ప్రజాప్రతినిధులు సమస్యలను లెవనెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గౌరవం లేని పదవులు మాకేందుకంటూ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా ఎంపీపీ, జడ్పీటీసీలు స్థానిక సంస్థల సమస్యలపై సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. కొవిడ్-19 నేపథ్యంలో కొద్ది కాలంగా ప్రత్యక్ష సమావేశాలు, సమీక్షలు లేకపోవడంతో అధికారులను, ప్రజాప్రతినిధులకు సమస్యలు వివరించినా పరిష్కారం కావడం లేదని సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం ప్రత్యక్ష పద్ధతిలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఖైరతాబాద్లోని కార్యాలయంలో జరిగింది. దీనికి హాజరైన ప్రజాప్రతినిధులు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. సభకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్‌లు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సభకు గైర్హాజరయ్యారు. జిల్లా పరిషత్తు నిధులు కేటాయింపుపై చైర్ పర్సన్ తమ అనుకూల వ్యక్తులకే విడుదల చేస్తోందని కందుకూర్ జడ్పీటీసీ జంగారెడ్డి, యాచారం ఎంపీపీ సుకన్యలు ఆరోపించారు. అంతేకాకుండా అభివృద్ధి పనుల శంకుస్ధాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సైతం ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని అన్నారు.

యాచారం ఎంపీడీవో కులం పేరుతో తమను అవమానిస్తోందని, వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలని మంత్రిని కోరారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తమకు న్యాయం చేయడం లేదని పోడియం వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. మంచాల జడ్పీటీసీ ఎంపీడీవో ఆఫీసుల్లో ఉన్న చాంబరుకు తాళం వేశారని, మేము ఎక్కడ కూర్చోవాలో కలెక్టర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము కూడా ప్రజా ప్రతినిధులమే.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయం.. మాకో న్యాయమా అంటూ సభ అధ్యక్షురాలిని నిలదీశారు. పలువురు సభ్యులు తమ మండలాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను సభలో లేవనెత్తారు. ముఖ్యంగా వ్యవసాయం, రైతుబంధు, రైతు బీమా, పంట నష్ట పరిహారం, వైద్యం, పాఠశాల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాడైన రోడ్ల నిర్మాణాలపై సభలో ప్రధానంగా చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన పలు పశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సభకు హాజరైన మంత్రి సబితా ఇంద్రరెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్ పలువురు సభ్యుల లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ పేరున, మున్సిపాలిటీలలో మున్సిపాలిటీల పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. ఈ నెల 17నుంచి గ్రామాల్లోని గ్రామ ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోని ప్రభుత్వ భూములను వంద శాతం గుర్తించాలని, జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశాల్లో మండల అధికారులు తప్పకుండా హాజరుకావాలని, హాజరు కాని వారి పేర్లను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లితే వారిపై చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. వికలాంగుల కోసం నిర్వహించే సదరన్ క్యాంపు కొండాపూర్, వనస్థలిపురంలో ఉన్నందున వికలాంగులకు ప్రయాణం చేయడం కష్టమవుతుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రికి తెలుపగా.. మంత్రి స్పందిస్తూ ప్రతి రెవెన్యూ డివిజన్‌లో సదరం క్యాంప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.

అర్హులైన వారికి పింఛన్లు అందించాలని జడ్పీటీసీ వెంకటేష్ కోరగా తప్పక అందచేస్తామని మంత్రి బదులిచ్చారు. రైతు వేదిక ద్వారా రైతులకు లాభం వచ్చే పంటలు కూరగాయలు, పప్పు దినుసులు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు బీమా ఆన్లైన్లో నిరంతరం చేసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. రేషన్ కార్డులు అర్హులైన వారిని గుర్తించి అందజేస్తామని, రేషన్ కార్డు రాని వారికి కూడా ఇస్తామని తెలిపారు. అధిక వర్షాలు పడినందుకు రైతులకు పంట నష్టం చెల్లించాలని జడ్పీటీసీలు కోరగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. భూ సమస్యలపై జిల్లాలో 80 వేల దరఖాస్తులు వచ్చాయని అందులో 72 వేల దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించడం జరిగిందని, మిగిలిన ఎనిమిది వేల దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.

యాసంగిలో వరి ఎక్కువగా పండినందున గన్ని బ్యాగులు కొరత వచ్చిందని ఈ సారి ముందుగానే గన్ని బ్యాగుల కోసం ఆర్డర్ చేశామని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలని, టీచర్లు లేనిచోట వెంటనే నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్, మంచి నీటి సౌకర్యాలు కల్పించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. కొవిడ్ సమయంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలకు గాను మంత్రి, ఇతర సభ్యులను అభినందించారు. వ్యాక్సిన్ ఇవ్వడంలో కూడా రంగారెడ్డి జిల్లాలో 90 శాతం వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత గురించి, పరికరాలు, భవనాలు గురించి నివేదిక వెంటనే ప్రజా ప్రతినిధులతో చర్చించి సమర్పించాలని ఆదేశించారు.



Next Story

Most Viewed