గతంలో ఆ పార్టీలో ఉన్నవాడే.. వ్యక్తిగత కక్షలు పార్టీకి ఆపాదించవద్దు

by  |
గతంలో ఆ పార్టీలో ఉన్నవాడే.. వ్యక్తిగత కక్షలు పార్టీకి ఆపాదించవద్దు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అడ్వొకేట్స్ గట్టు వామన్‌రావు దంపతుల హత్యకు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీ హర్షిణి స్పష్టం చేశారు. కుంట శ్రీనివాస్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా గెలిచాడన్నారు. అప్పుడు శ్రీధర్ బాబుకు కుంట శ్రీనివాస్ సన్నిహితంగా ఉండేవాడని అంటే.. ఈ హత్యకు మంథని ఎమ్మెల్యేకు సంబంధం ఉందని ఆరోపణలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

మంథనిలో జరిగిన ప్రతి హత్యను రాజకీయ కోణంలో ఆవిష్కరిస్తూ శ్రీధర్ బాబు తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారని శ్రీహర్షిణి ఆరోపించారు. శ్రీదర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వగ్రామమైన ధన్వాడలో ఐదు వరకు హత్యలు జరిగాయని, అప్పుడు ఆయన కారణంగానే అవి జరిగాయని భావించాల్సి వస్తోందని అన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఏనాడు హత్య రాజకీయాలను చేసేందుకు సాహసించలేదని తెలిపారు. శ్రీధర్ బాబు మాత్రం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్ శ్రీ హర్షిణి దుయ్యబట్టారు. వ్యక్తిగత కక్ష్యలతో జరిగిన ఈ హత్యల వెనక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని, సీఎం కేసీఆర్ ఉన్నారంటూ ఆరోపణలు చేసి శ్రీధర్ బాబు మీడియాలో హైలెట్ కావాలని చూస్తున్నారు తప్ప ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేవారు కాదన్నారు. ఇదంతా శ్రీధర్ బాబు కావాలని చేస్తున్నారని, ఈ విషయంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు కూడా ఎలాంటి సంబంధం లేదన్నారు. హైకోర్టు న్యాయవాద దంపతులను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీహర్షిణి ప్రకటించారు.



Next Story

Most Viewed