యువరాజ్‌ మళ్లీ మైదానంలోకి..

by  |
యువరాజ్‌ మళ్లీ మైదానంలోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి 2007 టీ-20 వరల్డ్‌ కప్‌లో యువరాజ్‌ సింగ్ చేసిన బ్యాటింగ్ ప్రదర్శన క్రికెట్‌ చరిత్రలో చెక్కుచెదరనిది. అతడి అద్భుత ప్రదర్శనతోనే ఎన్నో ఏండ్ల తర్వాత టీమిండియా టీ-20 కప్‌ కొట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు యువరాజ్ బ్యాటింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. కోట్లాది మంది అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ తర్వాత తన విజయ పరంపర కొనసాగించిన యువరాజ్2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటాడు. దీనికి తోడు 2008 నుంచే ఐపీఎల్‌లో యావరేజ్ స్కోర్లను నమోదు చేస్తూ తన ఉనికిని చాటాడు.

కానీ, 2011లో క్యాన్సర్‌ మహమ్మారి యువరాజ్ సింగ్‌ ఆటపై తీవ్రంగా ప్రభావం చూపింది. 2011 వరల్డ్ కప్ అనంతరం క్యాన్సర్‌తో పోరాడిన యువరాజ్‌ మృత్యువునే జయించినా.. ఆటలో పట్టు కోల్పోయాడు. ఆ తర్వాత చాలా కాలం విశ్రాంతి తీసుకున్న యువీ బ్యాటింగ్‌ ప్రదర్శనలో విఫలమయ్యాడు. ఎంతో శ్రమించినప్పటికీ యువ ఆటగాళ్ల మెరుగైన ప్రదర్శనకు తోడు.. కొత్త కొత్త బౌలర్లను ఎదుర్కొవడంలో తడబడ్డాడు. క్రమక్రమంగా జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువీ అభిమానులకు కన్నీళ్లు తెప్పించాడు. దీనికి తోడు 2019 వరల్డ్‌ కప్‌లో కూడా బీసీసీఐ యువరాజ్‌ను పక్కనబెట్టింది. బీసీసీఐ నిర్ణయం తర్వాత యువీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. దీంతో అతడు మొత్తానికే మైదానంలో కనుమరుగయ్యాడు. ఇక చివరి సారిగా 2019 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం నాలుగు మ్యాచులు ఆడిన అతడు 98 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్ 2020లో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. తొలి ఐపీఎల్ సీజన్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన యువరాజ్ ఆ తర్వాత ఏ జట్టులో కూడా స్థానాన్ని సంపాధించలేదు. ఈ పరిణామాలతోనే యువీ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

మహిష్మతిని వీడిన బాహుబలిలాగా.. యువరాజ్ సింగ్ క్రికెట్‌ను వీడాడని.. అతడి ప్రతిభను గుర్తించకుండా బీసీసీఐ పక్కనబెట్టిందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఎంతో మంది అభిమానులు కన్నీటితో పెట్టిన కామెంట్లు ప్రతీ ఒక్కరికీ యువరాజ్‌ ఆటను గుర్తు చేశాయి. ఎంత ఏడ్చిన ఏం ప్రయోజనం అన్నట్టుగానే యువీ రిటైర్మెంట్‌ను ప్రపంచం అంగీకరించక తప్పలేదు. ఆనాటి నుంచి ఏదో మ్యాచులో యువరాజ్ కనిపిస్తాడని క్రికెట్ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల ఆశలకు ఆయువు పోస్తూ యువరాజ్ మళ్లీ మైదానంలో బ్యాట్‌ పట్టేందుకు రెడీ అయ్యాడు.

అవును.. యువరాజ్ సింగ్ మళ్లీ మైదానంలో అడుగుపెడుతున్నాడు. బ్యాట్‌తో సిక్సర్లు బాదేందుకు కుస్తీలు చేస్తున్నాడు. ఇప్పటికే దేశవాలీ టోర్నీ పంజాబ్ తరఫున మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన యువీ మరో సరికొత్త టోర్నీలో కనిపించనున్నాడు. సరికొత్త ఆవిష్కరణతో వస్తున్న యూకేసీ (Ultimate Kricket Challenge 2020) లో బరిలోకి దిగుతున్నాడు.

అతడికి పోటీగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, ఇంగ్లాండ్‌కు వరల్డ్‌ కప్ తెచ్చి పెట్టిన ఇయాన్ మోర్గాన్, డేరింగ్ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ రస్సెల్, ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కేవిన్ పీటర్సన్, స్పిన్నర్ రషీద్ ఖాన్‌లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌ మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ రోజు రాత్రి నుంచే యూకేసీ హెడ్ టు హెడ్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. క్రికెట్ దిగ్గజాల కోసం ఒక్కొక్కరికి 4 మ్యాచులు, మ్యాచ్‌లో 15 బంతులతో సరికొత్త సీజన్ యూకేసీ పేరుతో శ్రీకారం చుట్టారు. ఈ టోర్నీ కేవలం ఇద్దరు ఆటగాళ్ల మధ్యనే సాగుతుండగా.. మొత్తం ఆరుగు దిగ్గజ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.

చాలా ఏండ్ల తర్వాత మళ్లీ మైదానంలో యువరాజ్‌ ప్రదర్శన కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ ‌ రాత్రి 9.30 గంటలకు యూకేసీ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కానీ, యువరాజ్ సింగ్ మూడో మ్యాచ్‌లో భాగంగా డిసెంబర్ 27న మైదానంలోకి రానున్అనాడు. అతడికి పోటీగా కెవీన్ పీటర్సన్‌ ఉండడంతో మ్యాచ్ మరింత ఆసక్తి రేపుతోంది. దీంతో ఎట్టకేలకు తమ అభిమాన క్రికెటర్‌ను గ్రౌండ్‌లో చూస్తున్నామంటూ యువీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

యూకేసీ మ్యాచ్‌ల వివరాలు:

డిసెంబర్ 24: ఇయాన్ మోర్గాన్ vs కెవిన్ పీటర్సన్

డిసెంబర్ 25: రషీద్ ఖాన్ vs కెవిన్ పీటర్సన్
డిసెంబర్ 25: యువరాజ్ సింగ్ vs ఇయాన్ మోర్గాన్

డిసెంబర్ 26: ఆండ్రీ రస్సెల్ vs రషీద్ ఖాన్
డిసెంబర్ 26: క్రిస్ గేల్ vs ఆండ్రీ రస్సెల్

డిసెంబర్ 27: కెవిన్ పీటర్సన్ vs యువరాజ్ సింగ్
డిసెంబర్ 27: క్రిస్ గేల్ vs కెవిన్ పీటర్సన్

డిసెంబర్ 28: ఇయాన్ మోర్గాన్ vs రషీద్ ఖాన్
డిసెంబర్ 28: క్రిస్ గేల్ vs ఇయోన్ మోర్గాన్

డిసెంబర్ 29: ఇయాన్ మోర్గాన్ vs ఆండ్రీ రస్సెల్
డిసెంబర్ 29: క్రిస్ గేల్ vs రషీద్ ఖాన్

డిసెంబర్ 30: ఆండ్రీ రస్సెల్ vs కెవిన్ పీటర్సన్
డిసెంబర్ 30: క్రిస్ గేల్ vs యువరాజ్ సింగ్

డిసెంబర్ 31: సెమీ-ఫైనల్ 1
డిసెంబర్ 31 సెమీ-ఫైనల్ 2



Next Story

Most Viewed