ఏపీలో కుల పంచాయితీ..

by  |
ఏపీలో కుల పంచాయితీ..
X

దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతూ ఉందో, ఏం జరగబోతోందో చాలా మందికి అంతుచిక్కడంలేదు. అపరిమితమైన అధికారం దక్కడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న జగన్ జగమొండిగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉండగానే, మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో అది కాస్తా కులం రంగు పులుముకుంది. రాజకీయ ప్రతీకార చర్యలు మునుపెన్నటికంటే పెచ్చుమీరిపోయాయి. కులం ఆధారంగానే నిర్ణయాలు జరుగుతున్నాయని జగన్ పరిపాలన గురించి కుప్పలుతెప్పలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం జగన్‌ను ఇరుకున పెట్టడానికి అవలంభించిన పద్ధతులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ పాలనలోనూ అదే జరుగుతోంది. కాకపోతే, అది కాస్త శృతి మించి, రెండు బలమైన కులాల మధ్య పంచాయితీ తెచ్చిందన్న అభిప్రాయమూ కలుగుతోందని సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు.

కుల రాజకీయాలు తెలుగు సమాజంలో కొత్త పరిణామమేమీ కాదు. తెలంగాణలోనూ అది ఏదో ఒక స్థాయిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మరికొంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఒక సీనియర్ నేత అభిప్రాయం ఇలా ఉంది. ”తెలుగుదేశం, వైస్సార్సీపీల మధ్య ఘర్షణగా కనిపిస్తున్నా పక్కాగా కుల రాజకీయ రూపానికి ఇది మరో పార్శ్వమే. ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రతీకార రాజకీయ సుడిగుండంలోకి నెట్టేశారు. నూతన రాజధాని అమరావతిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగుల్లో, గ్రాఫిక్స్‌లో ముంచెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చడం, మూడు రాజధానుల నిర్ణయం చేయడం యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఈ నిర్ణయం పూర్తిగా కుల విద్వేషంతోనే” అని ఆ నేత వ్యాఖ్యానించారు. ఒక కులంపై విద్వేషంతో రాజధానిని ఆగం పట్టించారని బహిరంగంగా కామెంట్ చేసినవారు చాలా మందే ఉన్నారు.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో నేత ”ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలన్న దుగ్దతో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తున్నారు. తనకు జరిగిన అవమానాలన్నీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకూ జరగాలని జగన్ భావిస్తున్నారు. ఆ యావలో పడి ఉచితానుచితాలు మరచిపోతున్నారు. చంద్రబాబుకు ఉన్న సెక్యూరిటీని తగ్గించడం, ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేయడం, తాజాగా విశాఖలో అడ్డగించడం ఇందులోభాగంగా జరిగిందే. చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ను ఇబ్బందిపెట్టారు. అయితే ఎప్పుడూ జగన్ రాజకీయ కార్యకలాపాలను అడ్డగించలేదు. జగన్, ఆయన అంతరంగికులు చాలా తొందరపడుతున్నారు. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీనే లేకుండా చేయాలని ఆరాటపడుతున్నారు. దాంతో ఒకదాని తర్వాత మరొకటిగా తప్పులు చేస్తున్నారు. జగన్ నుంచి మొదలుపెడితే మంత్రులు, ఎమ్మెల్యేలదాకా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నారు. వీళ్ళ చేతలు, మాటలు చూసి జగన్‌కు గతంలో అనుకూలంగా వ్యవహరించిన లేదా మద్దతుగా పనిచేసినవారు సైతం తలలు పట్టుకుంటున్నారు” అని తెలిపారు.

నిజానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో చాలావరకు న్యాయ పరీక్షలో నిలబడేవి కావనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. జగన్ చెబుతున్న వికేంద్రీకరణ వాదనను సైతం చాలా మంది ప్రజలు నమ్మడం లేదు. ఒక కులంపైన మంటతోనే ఆంధ్ర ప్రాంతాన్ని శిక్షిస్తున్నారనే భావన పలు సెక్షన్ల ప్రజల్లో ఉంది. జగన్ మనుషులు కూడా దుగ్ధను దాచుకోలేకపోతున్నారు. ఇక సామాన్య జనమే నమ్మని వికేంద్రీకరణ వాదనను కోర్టు నమ్ముతుందా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

కులతత్వ ప్రతీకార రాజకీయ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని, అన్ని రంగాలలో అనిశ్చితి, అయోమయం నెలకొన్నాయని, రాజధాని ఇక ఎప్పుడు ఎక్కడ ఉంటుందో చెప్పలేని దుస్థితి నెలకొందని మరో పార్టీ నేత వ్యాఖ్యానించారు. జగన్‌కు అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో మరొకరు అధికారంలోకి వచ్చి రాజధానిని మరోచోటుకి మార్చరన్న గ్యారంటీ కూడా ఏమీ లేదన్నారు. అనుభవరాహిత్యంతో దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ రాజకీయ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed