చంద్రబాబుకు భారీ షాక్.. కేడర్ లో గందరగోళం

by  |
Chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు వైసీపీ విజయఢంకా మోగించింది. జిల్లాలు మారుతున్నాయేమోగానీ విన్నింగ్ పార్టీ పేరు మాత్రం ఒక్కటే. అదై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ ఉన్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనైనా టీడీపీకి సానుకూల ఫలితాలు వస్తాయని ఆ పార్టీ భావించింది.

చివరికి సొంత జిల్లాలో కూడా చంద్రబాబుకు భంగపాటు తప్పలేదు. జిల్లా మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఫ్యాన్ గాలికి టీడీపీ కంచుకోట బద్దలైపోయింది. జిల్లాలో ఉన్న కార్పొరేషన్, మున్నిపాలిటీలలో వైసీపీ దెబ్బకు సైకిల్ చతికిలపడిపోయింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతోపాటు మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది.

వైసీపీ నేతల మధ్య వర్గ పోరు ఉన్న నగరి, పుత్తూరులాంటి నియోజకవర్గాల్లోనూ టీడీపీ కనీస ప్రభావం చూపించలేకపోయింది. చిత్తూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 స్థానాలు ఉంటే.. వైసీపీ 46 చోట్ల విజయం సాధించగా టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. ఒక స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక తిరుపతి నగరపాలక సంస్థ ఫలితాల విషయానికి వస్తే మొత్తం 49 స్థానాలు ఉండగా వైసీపీ 48 డివిజన్లను సొంతం చేసుకుంది. టీడీపీ ఒక్క చోట మాత్రమే గెలుపొందింది.

ఇక మున్సిపాలిటీలలోనూ అదేసీన్ రిపీట్ అయ్యింది. నగరిలో 29 వార్డులకు గానూ వైసీపీ 24, టీడీపీ-4, ఇతరులు ఒక్క చోట విజయం సాధించారు. పుత్తూరులో వైసీపీ 20 స్థానాల్లో గెలుపొందగా.. టీడీపీ 3 స్థానాలకే పరిమితం అయ్యింది.పలమనేరు మున్సిపాలిటీ విషయానికి వస్తే వైసీపీ 24 చోట్ల గెలుపొందగా.. టీడీపీ 2 చోట్ల గెలుపొందింది. మదనపల్లిలో వైసీపీ 33 చోట్ల టీడీపీ 2 చోట్ల గెలుపొందింది. చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో తెలుగు తమ్ముళ్లంతా పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. పార్టీ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed