పెండ్లి ఆగింది.. ప్రాణం పోయింది

by  |
పెండ్లి ఆగింది.. ప్రాణం పోయింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ జులాయి చేసిన పనికి యువతి ఆత్మహత్య చేసుకుంది. పెండ్లి కుదిరిందని తెలుసుకున్న మాజీ ప్రియుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా పెండ్లిని ఆపాలన్న ఉద్దేశంతో పెండ్లి చేసుకుంటున్న యువకుడికి వారిద్దరు కలిసి దిగిన పాత ఫోటోలు పంపాడు. దీంతో, ఆ సంబంధం కాస్తా క్యాన్సిల్ అయింది. పెండ్లి పెటాకులు కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాళ్లోకి వెళితే.. తిమ్మాపురం గ్రామానికి చెందిన కునుకుంట్ల పావని(23). హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తోంది. ఇటీవల తల్లిదండ్రులు స్వగ్రామానికి చెందిన ఓ అబ్బాయితో పెండ్లి సంబంధం కుదిరించారు. ఇక పట్నం నుంచి గ్రామానికి చేరుకున్న పావనికి పాత పరిచయాలు వెంటాడాయి. స్నేహం చేసిన పాపానికి ఇదే గ్రామానికి చెందిన బోడ్డుపల్లి వంశీ బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. అంతేకాకుండా పెండ్లి చేసుకోబోయే యువకుడికి.. వీరిద్దరు కలిసి దిగిన పాత ఫోటోలను సెండ్ చేశాడు. దీంతో పెండ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. దీనికి తోడు చాలా సార్లు పావనిని బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో బాధితురాలు తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పావని ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి గాలింపు చేసిన తల్లిదండ్రులకు చివరకు విషాదమే మిగిలింది. మంగళవారం స్థానిక గోపాల్‌నగర్‌ సమీపంలో వ్యవసాయం భూమి వద్ద పనికి వెళ్లిన రైతులు పావని మృతదేహాన్ని గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే, పావని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని గ్రహించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజే ఆత్మహత్య చేసుకుందని.. అందుకే శరీరంపై పొక్కులు వచ్చినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి:

బోడ్డుపల్లి వంశీ వేధింపులతోనే పావని ఆత్మహత్య చేసుకుందని స్థానిక ప్రజాప్రతినిధులు, విధ్యార్థి సంఘాల నేతలు చెప్పారు. వంశీతో పాటు గ్రామంలోని పలువురి యువకులు కూడా బ్లాక్‌మెయిల్ చేశారన్నారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed