థియేటర్లలోనే "సినిమా" నిలబడింది.. నిలబడుతుంది…

by  |
థియేటర్లలోనే సినిమా నిలబడింది.. నిలబడుతుంది…
X

సినిమా.. అనేది మహాసముద్రపు “అల” లాంటిది… పడినా లేవగల సత్తా, దమ్ము నా సినిమాకు ఉంది అని బల్లగుద్ది చెప్తున్నారు దర్శకులు వై.వి.ఎస్. చౌదరి. సినిమా ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకుని నిలబడింది.. నిలబడుతుంది.. అని అన్నారు. కొవిడ్ 19 కాదు.. దాని జేజమ్మ వచ్చినా నా సినిమాను వెండితెర మీద చూసే ప్రేక్షకుల కోరికను కట్టడి చేయలేవని, వారి ఆనందాన్ని చంపలేవని అన్నారు. ఆ నవరసాల అనుభూతిని కేవలం వెండితెర మీద మాత్రమే పొందగలం అన్నారు. అందరితో కలిసి సినిమా చూస్తేనే దాన్ని వంద శాతం ఎంజాయ్ చేయగలమన్నారు. ఉదాహరణకి కామెడీ సీన్ వస్తే మనకు నవ్వు రాకపోయినా అందరితో కలిసి చూడడం వల్ల నవ్వడం, భారీ డైలాగ్ లు, సూపర్ హిట్ పాటలు, స్టెప్ లకు విజిల్స్ కొట్టడం, పేపర్లు ఎగరేయడం .. ఇంట్లో ఒంటరిగా చూస్తే చేయగలమా. ఆ ఆనందాలను ఇంట్లో ఒంటరిగా కూర్చుని సినిమా చూస్తూ పొందగలమా అని ప్రశ్నిస్తున్నారు చౌదరి. కేవలం వెండితెరకు మాత్రమే అది సాధ్యం అవుతుంది అందుకే.. ప్రేక్షకులు పట్టాభిషేకాలు చేస్తారు.. బ్రహ్మోత్సవాలు జరుపుతారు అని చెప్పారు.

పుట్టిన ప్రతి మనిషి జీవితంలో సినిమా అనేది ఉంటుంది.. సినిమా వారి దినచర్యలో భాగం అవుతుంది. ఒక మనిషికి కష్టాలు వస్తే సినిమా కష్టాలు అంటారు.. అలాంటి కష్టం ఇప్పుడు సినిమాకు వచ్చింది. కానీ, ఖచ్చితంగా ఎదిరించి నిలబడుతుందని ధీమా వ్యక్త చేశారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతీ ఒక్కరూ సేవ చేసుకునేందుకు వస్తుంటారు అంటారు. కానీ అది నిజం కాదు.. వారిలో ఉన్న కళాతృష్ణను తీర్చుకునేందుకు సినీ కళామతల్లి ఒడిని చేరుతాం అంటున్నారు. కొవిడ్ 19 కారణంగా అడవి కాచిన వెన్నెల్లా ఒంటరి అయిపోయింది నా సినిమా ఇండస్ట్రీ .. కానీ తప్పకుండా జనజీవన స్రవంతిలో మమేకమై పూర్వ వైభవం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వై.వి.ఎస్. చౌదరి.

మే 23న తన పుట్టినరోజును పురస్కరించుకుని..తల్లిదండ్రులు, గురువు, సినిమా పై ఆకర్షణ పెంపొందించిన ఎన్టీఆర్ గారికి, దర్శకుడిగా జన్మనిచ్చిన సెల్యులాయిడ్ సైంటిస్ట్ అక్కినేని నాగార్జునకు, స్నేహితులు, ఆప్తులకు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed