హోమింగ్ రేసు.. వేలాది పావురాలు మిస్సింగ్!

by  |
pigeon-race
X

దిశ, ఫీచర్స్ : బైక్, కార్, జీప్ రేసింగ్‌ల మాదిరే ప్రపంచవ్యాప్తంగా జంతువులకు సంబంధించిన రేసులు కూడా జరుగుతాయి. కొన్ని దేశాల్లో ప్రతి ఏటా పావురాల రేసింగ్ నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన ‘హోమింగ్’ పావురాలే పాల్గొంటాయి. సుమారు 100 కిలోమీటర్ల (62 మైళ్ళు) నుంచి 1,000 కిలోమీటర్ల వరకు రేసులను కండక్ట్ చేస్తారు. నిర్దిష్ట దూరం తర్వాత అవి తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. ఈ క్రమంలోనే యూకేలోని చాలా ప్రాంతాల్లో ‘పీజియన్స్ రేస్’ జరగ్గా, అందులో పాల్గొన్న దాదాపు 40శాతం పైగా పావురాలు కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది.

యూకే వ్యాప్తంగా జరిగిన 50 రేసింగ్ వెంట్లలో పార్టిసిపేట్ చేసిన 2లక్షలకు పైగా పావురాల్లో దాదాపు 40శాతం వరకూ తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. మిస్ అయిన మొత్తం పక్షుల సంఖ్య లెక్కకు చిక్కడం లేదు. ఇక పీటర్‌బొరోలో జరిగిన రేసులో తిరిగిరాని పావురాల సంఖ్యే దాదాపు 5- 10వేలకు పైగానే ఉంటుందని నిర్వహకులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని పావురాల యజమానులు అంటున్నారు. తుఫాను సూచనలు ఉండటంతో పాటు, వాతావరణంలోని మార్పుల వల్లే తమ పావురాలు తప్పిపోయి ఉంటాయని కొందరు భావిస్తున్నారు.

పావురాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల అవి అలిసిపోయే అవకాశముందని, ఒకవేళ అవి ఎక్కడైనా పడిపోయినా, గుంపుగా కనిపించినా వాటికి ఆహారం, నీళ్లు అందించమని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు వాటి యజమానులు. అవి రేసు పావురాలని, వాటికి కాళ్లకు రింగులు ఉంటాయని, వాటివల్ల ఎలాంటి హాని ఉండదని భయపడకుండా చేరదీయమని అందులో పేర్కొన్నారు. ఇక కొన్ని రోజుల తరువాత పక్షులు తమ దారిలోకి వచ్చేందుకు 80% అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో ఇటువంటి విపత్తులను నివారించడానికి, రాయల్ పావురం రేసింగ్ అసోసియేషన్ బాస్ ‘ఎవాన్స్’ అసాధారణ వాతావరణ పరిస్థితులపై నివేదికలను పొందడానికి UK జాతీయ వాతావరణ సేవతో చర్చలు జరుపుతున్నాడు.


Next Story