అమెరికా డుమ్మా.. ఇజ్రాయెల్‌కు షాక్.. ఆ తీర్మానానికి ఆమోదం!

by Dishanational4 |
అమెరికా డుమ్మా.. ఇజ్రాయెల్‌కు షాక్.. ఆ తీర్మానానికి ఆమోదం!
X

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 33వేల మంది సామాన్య పౌరులు చనిపోయారు. ఇంత జరిగాక తొలిసారిగా ‘గాజా కాల్పుల విరమణ’ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆశ్చర్యకరంగా ఈసారి తీర్మానంపై ఓటింగ్‌కు అమెరికా గైర్హాజరైంది. ఇంతకుముందు మూడుసార్లు ఇదే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను సమర్ధిస్తూ తీర్మానాలను ప్రతిసారీ అమెరికా వీటో చేస్తూ వచ్చింది. అయితే ఇటీవలకాలంలో ఇజ్రాయెల్‌, అమెరికాల మధ్య గ్యాప్ పెరిగింది.అమెరికా మద్దతు లేకున్నా.. తాము ఈజిప్టు బార్డర్‌లో ఉన్న పాలస్తీనా ప్రాంతం రఫాపై వైమానిక దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. తమను లెక్క చేయకుండా అత్యుత్సాహంతో ముందుకు పోతున్న నెతన్యాహూకు కళ్లెం వేసేందుకే ఈసారి కాల్పుల విరమణ తీర్మానంపై ఓటింగ్‌కు అమెరికా దూరమైందని తెలుస్తోంది. ఇక ఈ తీర్మానాన్ని మరోసారి అమెరికా వీటో చేయకపోవడాన్ని ఇజ్రాయెల్ తప్పుపట్టింది. ఉగ్రవాదంపై తమ పోరును అమెరికా బలహీనపర్చిందని విమర్శించింది. అల్జీరియా ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి భద్రతామండలిలోని మొత్తం 15 దేశాలకుగానూ 14 అనుకూలంగా ఓటువేశాయి. దీంతో తీర్మానం పాసైంది. శాశ్వత, సుస్థిర కాల్పుల విరమణకు ప్రయత్నించాలని పాలస్తీనా, ఇజ్రాయెల్‌లకు భద్రతా మండలి సూచించింది. ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ తప్పక అమలు చేయాలని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. ఒకవేళ దీన్ని ఇజ్రాయెల్ అమలు చేయకపోతే.. అది క్షమించరాని చర్యగా మారుతుందని హెచ్చరించారు.


Next Story