క్షిపణి పరీక్షలు చేపట్టిన తైవాన్: చైనాతో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

by Dishanational2 |
క్షిపణి పరీక్షలు చేపట్టిన తైవాన్: చైనాతో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా తైవాన్ దేశాల మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తైవాన్ చుట్టూ చైనా తమ యుద్ధ విమానాలు, నౌకలను నిరంతరం మోహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తైవాన్ క్షిపణులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలను పరీక్షించింది. తైవాన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఈ కసరత్తులు నిర్వహించిం. ఇందులో తైవాన్ దేశీయంగా తయారు చేసిన స్కై బో ఆర్మీ, నావికాదళంతో పాటు యూఎస్ తయారు చేసిన పేట్రియాట్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. ఈ వ్యాయామం విజయంతంగా సాగిందని తైవాన్ ఉన్నతాధికారులు తెలిపారు. ‘తైవాన్ చుట్టుపక్కల తరచుగా చొరబాట్లు చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రతిస్పందించడానికి వైమానిక దళం శిక్షణ తీవ్రతను పెంచుతామని’ పేర్కొన్నారు.

తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ వ్యవస్థకు పెద్ద పీట వేసింది. రక్షణ వ్యయాన్ని భారీగా పెంచి సైనిక ఆయుధాలను కొనుగోలు చేసింది. జలాంతర్గాములు, నౌకల వంటి తైవాన్-నిర్మిత పరికరాలను అభివృద్ధి చేసింది. మంగళవారం ఈశాన్య యిలాన్ కౌంటీలోని సువా ఓడరేవులో దేశీయంగా తయారు చేసిన యుద్ధనౌకలు ‘టువో చియాంగ్’, ‘క్లాస్ కొర్వెట్‌’ అనే నౌకలను అప్పగించడాన్ని త్సాయ్ ఇంగ్-వెన్ స్వయంగా పర్యవేక్షించారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా, రక్షణ స్వయంప్రతిపత్తిని తైవాన్ స్థిరంగా అమలు చేసింది. ఈ విజయాలు తైవాన్ సామర్థ్యాన్ని పదేపదే ప్రదర్శిస్తాయి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను కాపాడుకోవాలనే సంకల్పాన్ని రుజువు చేస్తాయి’ అని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఈ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకే రెచ్చ గొట్టే చర్యలకు పాల్పడుతోంది. తైవాన్ చుట్టు యుద్ధ విమానాలు మోహరిస్తోంది. మంగళవారం కూడా తైవాన్ చుట్టూ 13 చైనా విమానాలు, ఏడు నౌకలు కనిపించాయని తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతవారం కూడా 34 సైనిక విమానాలను తైవాన్ చుట్టు చైనా మోహరించింది. కానీ తైవాన్ చైనా వాదనలకు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తోంది.


Next Story