తైవాన్‌లో రికార్డు స్థాయిలో భూకంపం

by Disha Web Desk 16 |
తైవాన్‌లో రికార్డు స్థాయిలో భూకంపం
X

న్యూఢిల్లీ: తైవాన్‌లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. ఆదివారం రిక్టారు స్కేలుపై ముందుగా 7.2గా నమోదైనట్లు పేర్కొన్న 6.9గా ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తైటుంగ్ పట్టణానికి ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నివేదిక పేర్కొంది. భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి, షాపింగ్ మాల్స్ నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ప్రమాదంలో క్షతగాత్రులు, మరణాల సంఖ్య గురించి స్పష్టత రాలేదు.

కొన్ని ప్రాంతాల్లో భవనాలు ధ్వంసం అయ్యాయి. చికే, లియుషిషి పర్వతంలో రోడ్డు బ్లాక్ అవడంతో 600 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు తెలిపారు. శనివారం కూడా ఇదే ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే తాజాగా నమోదైన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. ఫుజియాన్, గ్వాంగ్‌డాంగ్, జియాంగ్సు, షాంఘై సహా తీర ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయని చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ తెలిపింది. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తైవాన్ ప్రభుత్వం సూచించింది. కాగా, తైవాన్‌లో తరుచుగా భూకంపాలు సంభవిస్తాయి. గతంలో 1990లో సంభవించిన భూకంపంలో 7.6 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదుకాగా, 2,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.



Next Story

Most Viewed