Pakistan | దేశం సంక్షోభంలో ఉంటే మీకు విదేశీ టూర్లు అవసరమా.. ఇమ్రాన్ ఖాన్ ఫైర్

by Dishanational1 |
Pakistan | దేశం సంక్షోభంలో ఉంటే మీకు విదేశీ టూర్లు  అవసరమా.. ఇమ్రాన్ ఖాన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జార్దరీపై మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ విరుచుకుపడ్డారు. దేశం సంక్షోభంలో కూరుకుపోయి ఉండగా విదేశీ పర్యటనలు చేయడం ఏమిటని విమర్శలు చేశారు. లాహోర్‌లో చేపట్టిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు, రాజ్యాంగం, పాకిస్థాన్ చీఫ్ జస్టీస్ ఉమార్ అటా బందిలాల్ కు సంఘీబావం తెలిపేందుకు ఆయన ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో పాకిస్తాన్ అవమానాలకు గురవుతోందని ఆరోపించారు. "ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న బహిలావల్ బుట్టో.. తన పర్యటనలపై దేశ సొమ్మును ఖర్చు చేస్తున్నారు.. దీనివల్ల ఏదైనా లాభం లేదా నష్టం ఉంటుందా అని ఎవరినైనా అడిగారా?" అంటూ ప్రశ్నించారు.

అలాగే తాజాగా యూకేలో కింగ్ చార్లెస్ 3 కి జరిగిన పట్టాభిషేకం మహోత్సవంలో అక్కడికి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వెళ్లారు. మరోవైపు బిలావల్ బుట్టో భారత్‌‌లోని గోవాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజన్‌(SEO) సమావేశంలో పాల్గొనేందుకు గురువారం వచ్చారు. అయితే ఈ సమావేశంలో విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో బిలావల్‌ మాట్లాడుతూ తమ దేశం కూడా ఉగ్రవాదానికి బలైందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తానూ బాధితుడినేని.. తన తల్లి బేనజీర్‌ భుట్టో కూడా ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారని తెలిపారు. ఉగ్రవాదాన్ని దౌత్య సంబంధాల్లో ఆయుధంగా వినియోగించకూడదంటూ పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాకిస్థాన్‌ను పరోక్షంగా విమర్శించారు. తీవ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సమర్థించకూడదని తాము బలంగా విశ్వసిస్తున్నామని.. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని ఆపాలని పేర్కొన్నారు.

ఈ విదేశీ పర్యటనలపై ఇమ్రాన్ ఖాన్ కౌంటర్ ఇస్తూ.. ఇక్కడ ప్రజలు అల్లాడిపోతుంటే దేశాలు పట్టుకుని తిరుగుతారా అని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజల నిత్యావసరాలు కొనలేని దుస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు.. అవి లాభదాయకంగా ఉంటాయా? లేదా? అని బేరీజు వేసుకోకుండా.. ప్రజల సొమ్ము ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయవచ్చా? అని ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రిపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు.

Next Story

Most Viewed