భారత్-కెనడా మధ్య ఖలిస్థానీ వార్.. మరోసారి ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు..!

by Disha Web Desk 19 |
భారత్-కెనడా మధ్య ఖలిస్థానీ వార్.. మరోసారి ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్-కెనడాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రోజురోజుకు వివాదం పెరుగుతోంది. కానీ తగ్గుతున్నట్లు కనబడట్లేదు. ఖలిస్థానీ ఉగ్రవాదులను చేరుదీస్తున్నారని భారత్ కెనడాపై తీవ్ర ఆగ్రహం మీద ఉంది. మరోవైపు ఇటీవల మన దేశానికి వచ్చే కెనడా పౌరుల వీసాల జారీని కేంద్రం నిలిపివేసింది. భారత్‌లో ఉండే కెనడా అధికారిని సైతం పంపించింది.

ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారి తీసింది. కెనడాలోని భారత పౌరుల కోసం భారతదేశం కాన్సులేట్ సేవలను విస్తరించింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రూడో మరోసారి మీడియా ముందు భారత్‌పై కామెంట్స్ చేశారు. నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారాన్ని కొద్దివారాల క్రితమే భారత్‌కు కెనడా వెల్లడించినట్లు చెప్పారు. ఈ విషయంలో మేం భారత్‌తో నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సీరియస్‌ ఇష్యూలో భారత్‌ మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.

కాగా, నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందన్న ట్రూడో ఆరోపణలను భారత్‌ ముందు నుంచి ఖండిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ వివాదంపై అమెరికా మద్యలోకి ఎంటర్ అవుతూ పెద్దన్న పాత్ర పోషించాలని భావిస్తుంది. భారతదేశం-కెనడా వివాదంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ ఇవాళ మాట్లాడుతూ "మేము చాలా ఆందోళన చెందుతున్నాము. మేము కెనడా ప్రభుత్వం, భారత్ ప్రభుత్వ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము.’ అని పేర్కొన్నారు.

మరోవైపు వాషింగ్టన్ నుంచి కెనడా ఆరోపణలపై, మాజీ పెంటగాన్ అధికారి అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో అయిన మైఖేల్ రూబిన్ మాట్లాడుతూ జస్టిన్ ట్రూడో రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, అతను చాలా చిన్న చూపు కలవాడని విమర్శించారు. భారత్-కెనడా వివాదంపై, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. కెనడా ప్రధాని ట్రూడో లేవనెత్తిన ఆరోపణలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు.

Next Story

Most Viewed