మాస్కోపైకి ఐసిస్‌ను ఉసిగొల్పింది అమెరికానే.. రష్యా సంచలన ఆరోపణ

by Dishanational4 |
మాస్కోపైకి ఐసిస్‌ను ఉసిగొల్పింది అమెరికానే.. రష్యా సంచలన ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రదాడి చేసిన దుండగులు 150 మంది సామాన్యులను పొట్టన పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలోనూ అమెరికా ప్రపంచ పోలీస్ అనేలా వ్యవహరిస్తోంది. రష్యా అడగకముందే.. ఆ ఉగ్రదాడి చేసింది ఐసిస్-ఖొరాసన్ (ఐసిస్-కే) అని పదేపదే ప్రకటనలు చేస్తోంది. అమెరికా ప్రకటనలపై రష్యా ఘాటుగా స్పందించింది. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందిస్తూ.. ‘‘ఔనా.. మాస్కోలోని క్రాకస్ కాన్సర్ట్ హాల్‌పై దాడి చేసింది నిజంగా ఐసిసేనా ? మీరు కచ్చితంగా చెప్పగలరా ? మరోసారి చెక్ చేసుకుంటారా ?’’ అని అమెరికాకు ప్రశ్నలు సంధించారు. ‘‘ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధంలో నిమగ్నమై ఉన్న రష్యాను దెబ్బతీసే దురుద్దేశంతో అమెరికాయే ఈ దాడికి ఐసిస్‌ను ప్రేరేపించింది. ఐసిస్ అమెరికా చేతిలో కీలుబొమ్మ. 1980వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని రష్యా సైన్యంపై పోరాడేందుకు ముజాహిదీన్లకు ఆయుధ సాయం చేసింది అమెరికాయే కదా ?’’ అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు రష్యాలోని ప్రముఖ వార్తాపత్రికకు మరియా జఖరోవా ఓ వ్యాసం రాశారు. ఇదే అంశంపై రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. ‘‘ఏదైనా అంశంపై విచారణ కొనసాగుతున్నప్పుడు దాని గురించి చర్చించుకోవడం సరికాదు. ఈ దాడి చేసింది ఎవరనేది దర్యాప్తులో తేలుతుంది. మాస్కోపై ఎటాక్ చేసింది ఐసిసే అని మేం ఇప్పుడే చెప్పలేం. అమెరికా ఇంటెలీజెన్స్‌ ఆధారంగా మేం ఒక నిర్ధారణకు రాలేం. ఇది చాలా సున్నితమైన అంశం’’ అని స్పష్టం చేశారు.


Next Story