మాల్దీవులు కీలక నిర్ణయం: భారత్‌తో హైడ్రోగ్రాఫిక్ ఒప్పందం రద్దు

by Dishanational2 |
మాల్దీవులు కీలక నిర్ణయం: భారత్‌తో హైడ్రోగ్రాఫిక్ ఒప్పందం రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించేందుకు భారత్‌తో మాల్దీవులు ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు వెల్లడించారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలు స్వయంగా చేపట్టేందుకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. మాల్దీవుల జలాల్లో నిరంతరం పర్యవేక్షణ వ్యవస్థను నెలకొల్పేందుకు తమ దేశం కృషి చేస్తోందని తెలిపారు. ‘మాల్దీవులు జలాల్లో అన్ని విషయాలపై పరిశోధనకు భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని నిర్ణయించాం. ఈ నీటి దిగువన ఉన్న వివరాలన్నీ మా ఆస్తి, మా వారసత్వం’ అని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఉచిత సైనిక సహాయాన్ని అందించడానికి మాల్దీవులతో చైనా రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే ముయిజ్జు ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కాగా, 2019లో ప్రధాని మోడీ మాల్దీవులు పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య హైడ్రోగ్రాఫిక్ ఒప్పందం కుదిరింది. దీనిపై అప్పటి మాల్దీవులు అధ్యక్షుడు అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్, ప్రధాని మోడీ ఇరువురు సంతకాలు చేశారు. దీని ప్రకారం.. భారతదేశ హైడ్రోగ్రఫీ కార్యాలయం సహకారంతో ఇటీవలి హైడ్రోగ్రాఫిక్ సర్వే జనవరి 2021లో ప్రారంభమైంది. గత ప్రభుత్వాలు భారత్‌తో కుదుర్చుకున్న 100కు పైగా ఒప్పందాలను సమీక్షిస్తున్నట్లు ముయిజ్జు గతంలోనే ప్రకటించారు. ముయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్-మాల్దీవుల సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed