అది యుద్ధం కాదు మారణహోమం: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా

by Dishanational2 |
అది యుద్ధం కాదు మారణహోమం: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణను మారణహోమంతో అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో తీవ్ర మారణహోమానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరుగుతున్న ఆఫ్రికన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా లూలా మీడియాతో మాట్లాడారు. యూదులను హిట్లర్ అణచివేసినట్టు పాలస్తీనియన్లను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందన్నారు. ఇది సైనికులకు, సైనికులకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని.. సైన్యం, మహిళలకు, పిల్లలకు మధ్య జరుగుతున్న యుద్ధమని తెలిపారు. పాలస్తీనాలో ఏం జరుగుతుందో ప్రపంచ మంతా చూస్తుందని, మరే యుద్ధంలోనూ ఇలాంటి మారణహోమం జరగబోదని వెల్లడించారు. యుద్ధానికి, మారణహోమానికి చాలా వ్యత్సాసం ఉందని చెప్పారు. కాగా, రఫా నగరంలో ఇజ్రాయెల్ దాడికి పాల్పడుతుందన్న వార్తల నేపథ్యంలో లూలా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరంచుకున్నాయి.

లూలా వ్యాఖ్యలు సిగ్గుచేటు: నెతన్యాహు

బ్రెజిల్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. లూలా వ్యాఖ్యలు సిగ్గు చేటని చెప్పారు. తనకు తాను రక్షించునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూనే ఇజ్రాయెల్ పోరాడుతోందని గుర్తు చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని బ్రెజిల్ రాయబారిని వివరణ కోరారు. కాగా, గతేడాది అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాదాపు 1,200 మంది పౌరులను చంపి, దాదాపు 250 మందిని బందీలుగా చేసుకోవడంతో యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు సుమారు 28,985 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు సమాచారం. ఇంకా 130 మందికి పైగా బంధీలుగా ఉన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed