పాక్‌పై మరోసారి ఇరాన్ దాడి: పలువురు ఉగ్రవాదుల హతం!

by Dishanational2 |
పాక్‌పై మరోసారి ఇరాన్ దాడి: పలువురు ఉగ్రవాదుల హతం!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌పై ఇరాన్ మరోసారి దాడి చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి పాక్ భూభాగంలో జరిగిన ఈ దాడిలో..జైషే-ఆల్-అద్ల్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్, అతని సహచరులు కొందరిని మట్టుబెట్టినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ తెలిపింది. అయితే ఏ నగరంలో దాడి జరిగిందన్న విషయాన్ని వెల్లడించలేదు. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులు నిర్వహించిన ఒక నెల రోజుల తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఏడాది జనవరి 16న కూడా ఇరాన్ పాక్ పై దాడి చేసింది. క్షిపణులు, డ్రోన్లతో పాక్‌లోని బలూచిస్థాన్ పై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారు. దానికి పాక్ కూడా ధీటుగా స్పందించింది. ఇరాన్ పై వైమానిక దాడి చేసింది. దీంతో ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలూ అంగీకరించగా..తాజా దాడి జరగడం గమనార్హం.

ఆగ్నేయ ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల ఘటనల్లో షాబక్ష్ ప్రధాన నిందితుడని ఇరాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారం మేరకు హతమార్చినట్టు తెలుస్తోంది. కాగా, జైషే-అల్-అద్ల్ సంస్థను 2012లో ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఇది ఇరాన్ ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్-బలూచిస్థాన్‌లో పనిచేస్తున్న సున్నీ ఉగ్రవాద సంస్థ. ఇరాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించి అక్కడ భద్రతా దళాలపై అనేక దాడులు నిర్వహించింది. గతేడాది డిసెంబరులో సిస్తాన్-బలూచిస్తాన్‌లోని ఒక పోలీసు స్టేషన్‌లో కనీసం 11 మంది పోలీసులను చంపిన దాడికి జైషే-అల్-అద్ల్ బాధ్యత వహించింది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర చర్యలను నియంత్రించాలని పాక్‌ను ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది.

Next Story

Most Viewed