ఆ సంస్థలో భారత్‌కు సభ్యత్వం లేకపోవడం సరికాదు: ఐరాస పనితీరుపై మస్క్ కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
elon musk
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్య సమితిలో అత్యున్నత విభాగమైన భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం సరికాదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం ఉండాలని తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఐరాస అనుబంధ సంస్థలను పునర్:వ్యవస్థీకరించాలి. శక్తిమంతమైన దేశాలు వాటి సభ్యత్వాన్ని వదులు కోవడం లేదు. ఇది అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫ్రికా దేశాలు సైతం సమిష్టిగా ఐరాసలో ప్రాతినిధ్యం కలిగి ఉండాలి’ అని తెలిపారు. ఇటీవల ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ యూఎఓలో సంస్కరణలు అవసరమని తెలిపారు. ‘సంస్థలు ప్రస్తుత ప్రపంచానికి అనుగుణంగా ఉండాలి. 80 ఏళ్ల క్రితం నాటి పరిణామాలను విడిచిపెట్టాలి. భద్రతా మండలిలో ఆఫ్రికా దేశాలకు ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం ఎందుకు లేదు’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగానే మస్క్ స్పందించి పై వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు భద్రతా మండలి సంస్కరణలపై చర్చల్లో పురోగతి లేకపోవడం పట్ల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

భద్రతా మండలి అంటే?

భద్రతా మండలి అనేది ఐక్యరాజ్యసమితి అరు అంగాలలో అత్యంత కీలకమైన విభాగం. అంతర్జాతీయంగా శాంతి, భద్రతను నియంత్రించే అధికారం దీనికి ఉంటుంది. ఐక్యరాజ్యసమితిలో కొత్త సభ్యులను చేర్చడానికి ఈ సంస్థ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రస్తుతం 15 సభ్య దేశాలుండగా.. 5 దేశాలు(చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా)లు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సంస్థలో భారత్ గతంలో ఎనిమిది సార్లు శాశ్వత సభ్యదేశంగా ఉంది. ఈ దేశాలు వీటో అధికారాన్ని కూడా కలిగి ఉంటాయి. మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా అది వీగిపోతుంది. అయితే యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం కావాలని భారత్ డిమాండ్ చేస్తుండగా.. చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed