మొండిగా ఉన్నందుకు సింధు జలాల విషయంలో పాక్‌కు భారత్ నోటీసులు

by Disha Web Desk 17 |
మొండిగా ఉన్నందుకు సింధు జలాల విషయంలో పాక్‌కు భారత్ నోటీసులు
X

న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటి)అమలులో పాకిస్థాన్ మొండిగా వ్యవహరిస్తోందని భారత్ ఆరోపించింది. దీంతో దాయాది దేశానికి నోటీసులు ఇచ్చింది. సవరించిన నోటీసును జనవరి 25నే ఇస్లామాబాద్‌కు పంపామని భారత్ వర్గాలు చెబుతున్నాయి. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం 1960 సెప్టెంబర్‌లో ఇండియా, పాకిస్థాన్ దేశాలు ఐడబ్ల్యూటిపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు కూడా సంతకం చేసింది.

నదీ జలాల వినియోగానికి రెండు దేశాల మధ్య సహకారం, సమాచార మార్పిడి కోసం ఒక యాంత్రిక విధానాన్ని రూపొందించింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కగా... రావి, బియాస్, సట్లేజ్ నదులు భారత్‌కు దక్కాయి.

రెండు దేశాల సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ కూడా ఏర్పాటైంది. ఐడబ్ల్యూటిలోని ప్రతి అక్షరాన్ని అమలు చేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉందని.. బాధ్యతాయుతమైన భాగస్వామిగా వ్యవహరిస్తోందని ఆ వర్గాలు చెప్పినట్టు ఓ వార్తా సంస్థ పేర్కొంది. 'ఐడబ్ల్యూటిలోని నిబంధనలను పాకిస్థాన్ అమలు చేయకపోవడంతో ఒప్పందాన్ని సవరించడానికి భారత్ బలవంతంగా నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది' అని భారత్ వర్గాలు చెబుతున్నాయి.

భారత్‌లోని కిషన్‌గంగా, రాట్లే హైడ్రో ఎలక్రిక్ ప్రాజెక్ట్‌ల సాంకేతిక అభ్యంతరాలపై చర్చించేందుకు పాక్ నిరాకరిస్తూనే ఉంది. వాటిని పరిశీలించేందుకు తటస్థ నిపుణుడిని నియమించాలని 2015లో పాకిస్తాన్ కోరింది. అయితే మరుసటి సంవత్సరమే ఈ డిమాండ్‌ను ఇస్లామాబాద్ ఉపసంహరించుకుంది. కానీ తమ అభ్యంతరాలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

పాకిస్థాన్ ఏకపక్ష చర్య ఐడబ్ల్యూటిలోని ఆర్టికల్ 9 ద్వారా రూపొందించిన వివాద పరిష్కారం గ్రేడెడ్ మెకానిజం కు విరుద్ధంగా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ విషయాన్ని తటస్థ నిపుణుడికి సూచించాలని వరల్డ్ బ్యాంక్‌ను భారత్ అభ్యర్థిచింది. దీనిపై పాకిస్తాన్ ఒత్తిడి తేవడంతో తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రపంచ బ్యాంక్ ప్రారంభించింది.

దీనిపై స్పందించిన భారత్ ఒకే అంశంపై రెండు చర్చలు చేపట్టడం సింధు జలాల ఒప్పందం ఉల్లంఘించడమే అని ఆరోపించింది. ఈ ఉల్లంఘనల కారణంగానే ఒప్పందం సవరణకు నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని భారత వర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed