కొవిడ్‌ను భారత్ ధీటుగా ఎదుర్కొంది: విదేశాంగ మంత్రి జైశంకర్

by Dishanational2 |
కొవిడ్‌ను భారత్ ధీటుగా ఎదుర్కొంది: విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కొవిడ్-19ను భారత్ ధీటుగా ఎదుర్కొందని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. కొవిడ్ దేశంలోకి ప్రవేశించినప్పుడు ఆందోళన చెందామని కానీ, ఆ తర్వాత వందలాది దేశాలకు వ్యాక్సిన్ అందించి సహకార దేశంగా అవతరించామని కొనియాడారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడి ప్రవాస భారతీయులతో పెర్త్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కొవిడ్ సమయంలో వివిధ దేశాల నుంచి7 మిలియన్ల మంది భారతీయులను తిరిగి దేశానికి తీసుకురాగలిగామన్నారు. 1.4 బిలియన్ల మందికి టీకాలు వేయించినట్టు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులను సైతం రక్షించడానికి అధికారులు మూడు షిఫ్టులు పని చేశారని గుర్తు చేశారు. విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో భారత్ ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. చైనాతో చాలా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నామని, కానీ సరిహద్దులో భారత సైన్యం పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించిందని తెలిపారు. ‘ఆర్టికల్ 370 రద్దు సరైన నిర్ణయం. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ డెసిషన్ తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి’ అని చెప్పారు.

యూఎన్ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఖాయం

అంతకుముందు ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్సీలో)లో భారత్‌కు ఖచ్చితంగా శాశ్వత స్థానం లభిస్తుందని, అయితే అది అంత సులభం కాదని చెప్పారు. భారత్‌కు శాశ్వత స్థానం దక్కడం ఇష్టంలేని దేశాలు చాలానే ఉన్నాయన్నారు. తాను ప్రపంచవ్యాప్తంగా పర్యటించినప్పుడు మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను భిన్నంగా చూస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ డిస్కషన్స్‌లో కొంత మంది ఆధిపత్యం చెలాయిస్తున్నారని అది సరైన పద్దతి కాదని నొక్కి చెప్పారు. కాగా, ఆస్ట్రేలియా కౌంటర్ పెన్నీ వాంగ్‌తో జైశంకర్ సమావేశమై ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియాలో పరిస్థితి వంటి అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.


Next Story