గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలి: యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్

by Dishanational2 |
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలి: యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ పిలుపునిచ్చారు. పాలస్తీనా ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వారికి మానవతాసాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరారు. బ్లడీ సండే వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అలబామాలోని సెల్మాలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు వెంటనే అంగీకరించి, బంధీలను విడిపించి వారి కుటుంబ సభ్యులతో కలపాలని సూచించారు. గాజా ప్రజలకు తక్షణ సాయం అవసరమని నొక్కి చెప్పారు. అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో త్వరలోనే కాల్పుల విరమణ ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

చర్చలను బహిష్కరించిన ఇజ్రాయెల్!

కాల్పుల విరమణపై చర్చించేందుకు ఈజిప్టు రాజధాని కైరోలో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సమావేశాన్ని ఇజ్రాయెల్ బహిష్కరించినట్టు తెలుస్తోంది. తమ వద్ద సజీవంగా ఉన్న బంధీల పేర్లను రిలీజ్ చేయడానికి హమాస్ నిరాకరించడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఖతర్, ఈజిప్ట్ అధికారులు దోహాలో హమాస్ నాయకులతో సమావేశమయ్యారు. దీని తర్వాత కాల్పుల విరమణ ముసాయిదా సిద్ధం చేశారు. కానీ ఇజ్రాయెల్ తమ ప్రతినిధులను పంపక పోవడం, ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎటువంటి నిర్ణయం తీసుకోనట్టు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ రంజాన్ మాసం నాటికి అమలులోకి వస్తుందని హమాస్ ప్రతినిది ఒకరు వెల్లడించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed