ఇమ్రాన్ హవా.. ఇండిపెండెంట్లుగా పోటీచేసి సత్తాచాటిన అనుచరులు

by Dishanational4 |
ఇమ్రాన్ హవా.. ఇండిపెండెంట్లుగా పోటీచేసి సత్తాచాటిన అనుచరులు
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌‌లో ‘హంగ్’ సర్కారు ఏర్పాటు కాబోతోంది. దేశంలోని మొత్తం 265 పార్లమెంటు స్థానాలకుగానూ శుక్రవారం రాత్రి నాటికి 210 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో అత్యధికంగా 64 చోట్ల మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్’ (పీఎంఎల్ -ఎన్) పార్టీ గెలిచింది. దివంగత నాయకురాలు బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టోకు చెందిన ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’(పీపీపీ) 50 స్థానాల్లో గెలుపొందింది. ఈనేపథ్యంలో తామే గెలిచినట్లుగా నవాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. పీపీపీ సహా కలిసొచ్చే ప్రతి ఒక్కరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ)ను ఎన్నికల సంఘం బ్యాన్ చేసినప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగి సత్తా చాటారు. అత్యధికంగా 96 చోట్ల ఇమ్రాన్ ఖాన్ అనుచరులు గెలిచారు. సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌ను బలంగా నిలబెట్టాలని భావించే స్వతంత్ర ప్రజాప్రతినిధులంతా వచ్చి తమ ప్రభుత్వంలో చేరొచ్చని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అనుచరులు పెద్దసంఖ్యలో గెలిచినా.. పాక్ రాజ్యాంగం ప్రకారం వారంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడం తప్ప వారి ఎదుట మరో మార్గం లేదు.

Next Story