యాపిల్, గూగుల్, మెటా‌లపై ఆ కంప్లయింట్స్.. దర్యాప్తు షురూ

by Dishanational4 |
యాపిల్, గూగుల్, మెటా‌లపై ఆ కంప్లయింట్స్.. దర్యాప్తు షురూ
X

దిశ, నేషనల్ బ్యూరో : గూగుల్, యాపిల్, మెటా (ఫేస్ బుక్), బైట్ డ్యాన్స్ (టిక్ టాక్), మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు ఆయా విభాగాల్లో గుత్తాధిపత్యానికి యత్నిస్తున్నాయి. వాటికి పోటీగా ఇతర సంస్థలు నిలబడలేని స్థితిని మార్కెట్లో క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టే దిశగా ఐరోపా దేశాలు కీలక ముందడుగు వేశాయి. డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ (డీఎంఏ)ను మార్చి 7 నుంచే అమల్లోకి తెచ్చాయి. ఇందులో భాగంగా తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా గూగుల్, యాపిల్, మెటా కంపెనీల పనితీరుపై యూరోపియన్ కమిషన్ దర్యాప్తును ప్రారంభించింది. గూగుల్ సెర్చ్‌ రిజల్ట్‌లో పోటీ సంస్థల కంటే తన సొంత సేవలైన గూగుల్ షాపింగ్, గూగుల్ ఫ్లైట్స్, గూగుల్ హోటల్స్ టాప్‌లో కనిపించేలా సాంకేతికతను గూగుల్ దుర్వినియోగం చేస్తోందా ? లేదా ? అనే దానిపై విచారణ జరుగుతోంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో గూగుల్, యాపిల్ కంపెనీలు తమ యాప్స్‌ను ప్రమోట్ చేసుకుంటూ.. ఇతర సంస్థల యాప్స్‌ను టెక్నికల్‌గా అణచివేసేందుకు యత్నిస్తున్నాయా ? లేదా ? అనేది తేల్చే దిశగానూ దర్యాప్తు కొనసాగుతోంది. ఫేస్ బుక్ ప్రవేశ పెట్టిన యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ మోడల్‌పై వచ్చిన మూడు ఫిర్యాదులపైనా ప్రస్తుతం యూరోపియన్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఏదైనా టెక్ దిగ్గజ కంపెనీ పోటీ కంపెనీలను అణచివేసే కుట్రపూరిత విధానాలను, సాంకేతికతలను వినియోగిస్తోందని దర్యాప్తులో తేలితే సదరు సంస్థపై భారీగా జరిమానాలు విధించనున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో దోషిగా తేలే కంపెనీకి దాని వార్షిక గ్లోబల్ టర్నోవర్‌లో 10 శాతం మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఒకే కంపెనీపై రెండోసారి కూడా పాత అభియోగాలు నిరూపితమైతే జరిమానా విధించే అమౌంట్ 20 శాతానికి చేరుతుంది.


Next Story