ఆఫ్రికాలో ‘ఫ్రెడ్డీ’తుఫాను బీభత్సం.. 100 మందికి పైగా మృతి!

by Disha Web Desk 2 |
ఆఫ్రికాలో ‘ఫ్రెడ్డీ’తుఫాను బీభత్సం.. 100 మందికి పైగా మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలు ప్రజల ప్రాణాల్ని బలిగొంటున్నాయి. ఇటీవల టర్కీ భూకంప విషాదం మరువకముందే.. ఆఫ్రికాలో తుపాను బీభత్సం సృష్టించింది. ఆగ్నేయ ఆఫ్రికాలోని మలావి, మొజాంబిక్ దేశాలను ‘ఫ్రెడ్డీ’ తుఫాన్ అతాలకుతలం చేస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పెద్దఎత్తున వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ఇళ్లు కుప్పకూలిపోయాయి. దక్షిణ ఆఫ్రియా, మధ్య ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో జనాలు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు తుఫాన్ దాటికి 100 మందికి పైగా మృతి చెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 60 మంది మృతదేహాలను గుర్తించామని. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. గాయపడిన వారిని బ్లాంటైర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎక్కువగా మట్టి నివాసాలే ఉండడంతో వరదలు దెబ్బకు అన్నీ కూలిపోయి జనాలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఇక, మలావీలో నెలరోజుల వ్యవధిలో ఇలాంటి భయంకరమైన పరిస్థితిని నెలకొనడం ఇది రెండోసారి. ఫిబ్రవరి మొదటివారంలో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఈ ఫ్రెడ్డీ తుఫాను క్రమంగా బలపడుతూ దక్షిణ మహాసముద్రం అంతటా వ్యాపించింది. ప్రస్తుతం ఆఫ్రికాపై విరుచుకుపడుతోంది. బుధవారం తర్వాత తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Next Story

Most Viewed