ఆంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించిన అధికారులు

by Disha Web Desk 17 |
ఆంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీని తీవ్రమైన వేడి గాలుల కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించినట్లు సైన్యం తెలిపింది. ఆమెతో పాటు ప్రెసిడెంట్ యు విన్ మైంట్ (72) ఇద్దరినీ జైలు నుండి తరలించారు. అయితే, వారిని ఎక్కడికి తీసుకెళ్లారనే దానిపై స్పష్టత లేదు. విన్ మైంట్ మయన్మార్‌లోని బాగో ప్రాంతంలోని టౌంగూలో ఎనిమిదేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వేడిగాలులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీంతో జైల్లో ఉన్నటువంటి ఖైదీల ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుని అవసరమైన వారందరికీ, ముఖ్యంగా వృద్ధ ఖైదీలకు వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

మయన్మార్‌లో 2021లో సైన్యం, ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆమెకు జైలు శిక్ష విధించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమెను విడుదల చేయాలని గతంలో పిలుపునిచ్చింది. ఆమె మీద తప్పుడు కేసులు పెట్టారని మానవ హక్కుల నిపుణులు విమర్శించారు. గతేడాది సెప్టెంబరులో, ఆంగ్ సాన్ సూకీ కుమారుడు కిమ్ అరిస్ ఆమెకు చాలా తీవ్రమైన చిగుళ్ల వ్యాధి ఉందని, ఆమె తినడానికి ఇబ్బంది పడుతున్నదని చెప్పారు.


Next Story

Most Viewed