ఆస్ట్రేలియాలో బీచ్‌కు కొట్టుకొచ్చిన 160 తిమింగలాలు.. 26 మృతి

by Disha Web Desk 17 |
ఆస్ట్రేలియాలో బీచ్‌కు కొట్టుకొచ్చిన 160 తిమింగలాలు.. 26 మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో 160 పైలట్ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. దీంతో వాటిని రక్షించడానికి స్థానిక అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు. తిరిగి వాటిని సురక్షితంగా సముద్రంలోకి పంపించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గురువారం ఉదయం టోబిస్ ఇన్‌లెట్ వద్ద తిమింగలాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. కొనసాగుతున్న సహాయక చర్యల కారణంగా 100కు పైగా తిమింగలాలను సముద్రంలోకి తిరిగి పంపించారు. అయితే మిగిలిన వాటిలో 26 ఇప్పటికే చనిపోయాయని అధికారులు తెలిపారు. మరికొన్నింటిని కాపాడటానికి వన్యప్రాణి అధికారులు, సముద్ర శాస్త్రవేత్తలు, పశువైద్యులు, స్వచ్ఛంద సేవకులు కృషి చేస్తున్నారు.

సామూహికంగా అధిక సంఖ్యలో తిమింగలాలు సముద్ర ఒడ్డుకు ఎలా కొట్టుకువచ్చాయో అని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అయితే కొంతమంది పరిశోధకులు ఆహారం తీసుకున్న తర్వాత ఒడ్డుకు చాలా దగ్గరగా ఉన్న పాడ్‌ల ట్రాక్‌లో చిక్కుకున్నాయని భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పర్యావరణ ముప్పును తెలియజేస్తున్నాయని, సముద్ర జలాలు కలుషితం కావడం వలన వాటి ఆవాసాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాయి. వీలైనంత వేగంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పైలట్ తిమింగలాలు ఆరు మీటర్ల (20 అడుగులు) కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ఇంతకుముందు 2022లో న్యూజిలాండ్‌లోని మారుమూల చాతం దీవుల్లో సముద్రతీరానికి కొట్టుకు వచ్చిన దాదాపు 500 పైలట్ తిమింగలాలు చనిపోయాయి.



Next Story

Most Viewed