అడవిని ‘అమ్మ’లా కాపాడుతున్నరు

by  |
women forest Officers
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడవులు, వన్యప్రాణుల రక్షణలో ముందుంటున్నారు. రేయింబవళ్లు నడకతో అడవినంతా చుట్టేస్తూ విలువైన అటవీ సంపదను కాపాడుతున్నారు. వీరికి కనీస వసతులుండవు.. కానీ ఆత్మస్థైర్యంతో పురుషులకు దీటుగా అడవిలో విధులు నిర్వహిస్తున్నారు. వచ్చిన దారి మర్చిపోవచ్చు, ఏ ప్రమాదమైన ఎదురుకావచ్చు, అడవిలో స్మగ్లర్లు దాడి చేయొచ్చు. విధి నిర్వహణలో పులులు, ఎలుగుబంట్లు ఎదురైనా వెనకడుగేయని ధైర్యం వీరిది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా అడవి తల్లిని అమ్మలా కాపాడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వారికి ఎదురైన అనుభవాలు వారి మాటల్లోనే..

అడవిని అమ్మగా భావించా..

పట్టుదలతో చదివి.. 2013లో రేంజ్ ఆఫీసర్ జాబ్‌కి సెలక్ట్ అయ్యా. మాది వ్యవసాయ ఆధార కుటుంబం. అందుకే అడవిని దేవుడిలా భావిస్తా. వన్యప్రాణుల రక్షణలో భాగంగా వేటగాళ్లకు అవగాహన కల్పిస్తుంటా. అడవిలో ఎలాంటి చట్టవ్యతిరేక పనులు జరిగినట్లు తెలిసినా.. రాత్రి పగలు చూడకుండా 24 గంటలు అందుబాటులో ఉంటా. అడవిలోకి ఒంటరిగా చాలా సార్లు వెళ్లా.. భయంగా ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పటివరకూ అడవిలో ఉన్న జంతువుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. దానికి హాని చేస్తేనే మనపై తిరగబడుతుంది. ప్రజలు మా పై నమ్మకం ఉంచారు. మాకెలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా మాతో వస్తుంటారు. పదేళ్ల క్రితంతో పోల్చుకుంటే స్మగ్లింగ్ చాలా తగ్గింది. 2019లో నా సేవను గుర్తించి ‘కేవీఎస్ బాబు మెమోరియల్ గోల్డ్ మెడల్’ ని ప్రకటించారు. వన సంరక్షణ తమ ధ్యేయంగా ఉంటేనే ఈ ఉద్యోగానికి రావడం బెటర్. – సీహెచ్. అనిత, ఎఫ్ఆర్‌వో, ఖడెం

అందరికీ అవకాశం రాదు..

నా డ్యూటీలో ఎన్నో సార్లు పులుల్ని దగ్గర నుంచి చూశాను. కొంచెం తన శరీరాకృతి భయాన్ని కలిగించినా.. మాపై ఎప్పుడూ దాడి చేయలేదు. టైగర్ కారిడార్‌లో పనిచేసే అవకాశం అందరికీ దొరకదు. నాకు దొరికినందుకు గర్వంగా ఉంది. ఈ డ్యూటీ పై ప్యాషన్‌తో వచ్చా కాబట్టి నాకు ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. ఇష్టంతో చేసే పని ఎప్పుడూ కష్టమనిపించదు. ఓ మహిళ తన ఉద్యోగంలో రాణించాలంటే కుంటుంబం నుంచి సపోర్ట్ ఉంటేనే అది సాధ్యం. పులి సంచరించే ప్రాంతంలో మనుషులు ఉండటం, దానికి హాని కలిగిస్తున్నామన్న ఆలోచన పులికి వస్తేనే అది తిరగబడి చంపేస్తుంది. అంతేకాని పులి కావాలని మనుషులపై దాడి చేయదు. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతుంటాం. – పూర్ణిమా, ఎఫ్ఆర్‌వో, కాగజ్‌నగర్

అడవి నుంచి ఎప్పుడూ ఆపద రాలేదు

అడవిలో అడుగెయ్యగానే రకరకాల వన్యప్రాణులను చూసే సరికి ఎన్ని కిలోమీటర్లు నడిచినా అలసటే అనిపించదు. పులిని దగ్గరగా చూసినప్పుడు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఉద్యోగంలో చేరిన తొలిరోజుల్లో కష్టంగా అనిపించినా ఇప్పుడు నాకు సంతృప్తినిస్తుంది. డ్యూటీలో భాగంగా ఏదైనా ఎంక్రోచ్‌మెంట్ జరిగిందని తెలిసి వెళ్తే అక్కడున్న చిన్నచిన్న నాయకులు ప్రజలను రెచ్చగొట్టి మమ్మల్ని తిట్టిస్తుంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు ఈ చెవులు ఎందుకిచ్చాడో అని. అడవిలోకి స్వేచ్ఛగా వెళ్తున్నాం.. కానీ కొన్ని గ్రామాల్లో్కి వెళ్లలేకపోతున్నాం. గతంలో సార్‌సాల లో రైతులు తిరగబడి దాదాపు 200 మంది మాపై దాడి చేశారు. ఎలుగుబంటి నుంచి కూడా తప్పించుకున్న పరిస్థితులు నా కెరీర్‌లో ఎదురయ్యాయి. – రమాదేవి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాగజ్‌నగర్

అడవిలో ధైర్యంగా తిరుగుతున్నాం..

అడవిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. ఒంటరిగానే అడవిలోకి తరచూ వెళ్తుంటా. గిరిజనులు మాకూ చాలా సపోర్ట్ చేస్తారు. ఉన్నతాధికారులు కూడా మాకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మా డిపార్ట్మెంట్ లో ప్రన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకూ మహిళా అధికారులమే ఉన్నాం. గ్రామీణ స్థాయిలో ఉండే అటవీ సంరక్షుల అనుభవాలు మాకు చెప్పి ఇబ్బందులు కలగకుండా చూస్తారు. జనాలకు అవగాహన కల్పించి మాపై నమ్మకాన్ని కల్గించుకున్నాం. కొన్ని రోజుల కింద జరిగిన పులి దాడి ఘటన తర్వాత కొందరు మాపై వ్యతిరేకత చూపించినా చాలా మంది అర్థం చేసుకొన్నారు. అడవి మృగాల నుంచి నాకెప్పడూ హాని కలగలేదు. పులిని ఐదు మీటర్ల దగ్గర్నంచి చూశా. – అనిత, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, కాగజ్‌నగర్

Next Story

Most Viewed