దిశ, వెబ్‌డెస్క్ : వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. దేశంలో వరకట్న నిషేధానికి చట్టాలు తీసుకొచ్చినా అమల్లోకి వచ్చేసరికి కఠినంగా లేకపోవడమే నేటికి అదనపు కట్నపు వేధింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 23 ఏళ్ల వయస్సున్న ముస్లిం వివాహిత అయేషా తన భర్త, మామ అదనపు కట్నం కోసం పెట్టే వేధింపులు తాళలేక సబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే, బాధితురాలు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన సమస్యలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ‘తన భర్త ఆరీఫ్ నా నుంచి ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాడని.. అందుకోసమే అతను అడిగింది ఇస్తున్నానంటూ’ వీడియోలో చివరిసారిగా మాట్లాడింది. దీంతో మృతురాలి భర్త ఆరీఫ్, అతని తండ్రిపై కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.