ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. ప్రసవానికి పోతే ప్రాణం మీదకు తెచ్చారు

by  |
ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. ప్రసవానికి పోతే ప్రాణం మీదకు తెచ్చారు
X

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆళ్లపల్లి మండలం మార్కోడు గ్రామానికి చెందిన గర్భిణీ తాళ్లపెంట భాగ్యలక్ష్మీ గర్భం దాల్చిన నాటి నుండి తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమైన మందులు వాడుతున్నారు. నెలలు నిండటంతో ఆళ్లపల్లిలోని పీహెచ్సీకి వెళ్లగా వారు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

ఈనెల 17న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరిన భాగ్యలక్ష్మీకి అదే రోజు ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేంత వరకు భాగ్యలక్ష్మీ ఆరోగ్యంగానే ఉంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత భాగ్యలక్ష్మీకి ఫిట్స్ వచ్చిందని బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉందని తల్లికి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. దీంతో, ఆ కుటుంబం తల్లి బాగుంటే చాలు, తల్లి ప్రాణాలను కాపాడండి అంటూ ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటికే సదరు మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చిందని.. కానీ, అతను చనిపోయాడని, భాగ్యలక్ష్మీకి ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీ వార్డుకు తరలించామని తెలిపారు. ఆదివారం(17వ తేదీ) ఆపరేషన్ జరిగితే సోమవారం(18వ తేదీ) ఉదయం మధ్యాహ్న సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది. వేరే ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్లండి అని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అయితే.. దాదాపు 15 గంటల పాటు ఆమెకు అత్యవసర వైద్య చికిత్స అందించకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైందని బంధువులు ఆరోపిస్తున్నారు.

దీంతో ఆమెను ఖమ్మం తరలించగా అక్కడి వైద్యులు కూడా అదే చెప్పారు. సమయం గడిచిపోయింది ఇప్పుడు ప్రాణపాయ స్థితి ఏర్పడింది. తామేమి చేయలేమంటూ తేల్చి చెప్పి హైదరాబాద్ తరలించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మీకి దాదాపు మూడు లక్షలు ఖర్చు అయ్యాయి. ఆపరేషన్ సమయంలో సరైన వైద్యం అందించకపోవడం వల్లే మెదడులో రక్తం గడ్డకట్టిందని అక్కడి వైద్యులు తెలిపారు. మూడు లక్షలు ఖర్చు చేసినా ఆమె కోలుకుంటుందన్న నమ్మకం లేదని బంధువులు వాపోతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనులు ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ దవాఖానాను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడి వైద్యులు మాత్రం వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భాగ్యలక్ష్మీ ఆపరేషన్ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు భాగ్యలక్ష్మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఉచిత వైద్యం అందించి ఆమె ప్రాణాలను కాపాడాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.


Next Story

Most Viewed