ఎడారికి ప్రాణం పోసే ‘నానోక్లే’

by  |
ఎడారికి ప్రాణం పోసే ‘నానోక్లే’
X

దిశ, వెబ్ డెస్క్ : ఎడారిలో కర్జూరాలు, ఈతకాయలు పండుతాయన్నది తెలిసిందే, కానీ ఇప్పుడు పుచ్చకాయలు కూడా పండుతున్నాయి. ఇలా అంటున్నారేంటని ఆశ్చర్యపోకండి. అవును.. కేవలం పుచ్చకాయలే కాదు కటిక ఎడారిలో, మండే ఇసుకలో కీరదోసలు కూడా పండించే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్‌లో మునిగి తేలిన మార్చి నెలలోనే ఈ టెక్నాలజీ పూర్తిస్థాయి నిజరూపాన్ని సంతరించుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇలా ఇసుకలో ఆహారాన్ని పండించే టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రయత్నించి విజయాలు చూశారు.

తాజా ఆహారం కోసం తొంభై శాతం దిగుమతుల మీదనే ఆధారపడే యూఏఈ లాంటి దేశానికి ఇలా ఇసుకలో ఆహారాన్ని పండించే టెక్నాలజీ విజయవంతం కావడం నిజంగానే ఓ రకంగా మంచి పరిణామం. లాక్‌డౌన్ సమయంలో దిగుమతుల మీద నిషేధం విధించినపుడు ఈ పద్ధతిలో పండించిన పుచ్చకాయలు, కీరదోసలనే స్థానికులు ఆహారంగా తీసుకున్నారు. ఇంతకీ ఆ పద్ధతేంటి? దాన్ని ఎలా తయారుచేశారనే విషయాలను తెలుసుకుందాం.

ఇసుకను బలవర్థకమైన మట్టిగా మార్చడానికి నానోక్లే స్ప్రే టెక్నాలజీని ఉపయోగిస్తారు. నానోక్లే అంటే మట్టి, నీరు, ఇతర ఖనిజ లవణాలు కలిసిన ఒక చిక్కని మిశ్రమం. ముందుగా ఎడారిలో ఉన్న ఇసుక మీద ఈ నానోక్లే స్ప్రే చేశారు. నానోక్లేలో ఉన్న అతిసూక్ష్మ మట్టి రేణువులు, ఇసుకతో మిళితమై ఒక పొర ఏర్పడే వరకు ఇలా స్ప్రే చేస్తూనే ఉన్నారు. నానోక్లేలో ఉన్న రేణువులు నెగెటివ్ చార్జ్ కలిగి ఉండటం, ఎడారిలో ఇసుక పాజిటివ్ చార్జ్ కలిగి ఉండటంతో అవి రెండు ఒకదానితో ఒకటి తగలగానే ఒక గట్టి బంధం ఏర్పడి, బలంగా అతుక్కుపోతాయి.

ఇలా అతుక్కుపోయిన తర్వాత నీళ్లు పెట్టడం ద్వారా ఆ నీటిని ఒడిసి పట్టుకునే గుణం ఆ ఇసుకకు పెరుగుతుంది. ఇలా నీటిని ఒడిసి పట్టుకున్న తర్వాత అందులో విత్తనాలు పెట్టారు. ఆ విత్తనాలు మొలకెత్తేవరకు నానోక్లే స్ప్రే చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆ విత్తనాలు మొలకెత్తి వేర్లు అభివృద్ధి చెందిన తర్వాత వాటికి నానోక్లే స్ప్రే చేయడం ఆపేసి, పోషకాలు గల నీటిని అందించారు. అంతే.. ఆ మొలకలు పెరిగి పెద్దవై, ఇప్పుడు ఫలాలను అందిస్తున్నాయి. అయితే ఇది ఒక్క సంవత్సరమో రెండు సంవత్సరాలో కష్టపడి తయారు చేసిన టెక్నాలజీ కాదు. దీని కోసం దాదాపుగా 15 ఏళ్లు కష్టపడ్డారు. కానీ దీనికి స్ఫూర్తినిచ్చిన విషయం రెండు దశాబ్ధాల కిందటే జరిగింది. అదేంటంటే..

ఈజిప్టులో నైలు నది ఎడారి ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది. ఆ నైలు నదికి వరదలు వచ్చినపుడల్లా ఆ ఎడారిలో ఇసుక తిన్నెలు మునిగిపోయేవి. తర్వాత వరదలు తగ్గి నీరు వెనక్కి వెళ్లినపుడు ఆ ఇసుక తిన్నెల్లో సమృద్ధిగా పంటలు పండించేవారు. తర్వాత కొన్నాళ్లకు ఆ ఇసుక తిన్నెలు మీదుగా వరదలు వచ్చినప్పటికీ అందులో సారం ఉండకపోయేది. కొన్నేళ్ల తర్వాత ఆ సారం పూర్తిగా అంతరించి పోయి, వరదలు వచ్చినా కూడా అక్కడ పంటలు పండలేదు. కారణం ఏంటని అప్పటి పరిశోధకులు పరిశోధించారు. అందుకు కారణంగా దక్షిణ ఈజిప్టులో నైలు నది మీద కట్టిన అశ్వాన్ డ్యామ్ అని తెలిసింది.

ఆ డ్యామ్ కట్టడం వల్ల వరదల ద్వారా కొట్టుకొచ్చే అతిసూక్ష్మ మట్టిరేణువులు అక్కడే ఆగిపోయాయి. దీంతో దిగువున ఉన్న ఈ ఇసుక తిన్నెల్లో సారం నింపే మట్టి వరదల ద్వారా కొట్టుకురాలేదు. అంటే అతిసూక్ష్మ మట్టిరేణువులకు ఎడారి ఇసుకలో కూడా సారం నింపే శక్తి ఉందని అప్పుడు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు నానోక్లే టెక్నాలజీ తయారీలో ఉపయోగించారు.

నార్వేకు చెందిన డెజర్ట్ కంట్రోల్ సంస్థ వారు ఈ నానోక్లే టెక్నాలజీ విధానాన్ని అభివృద్ధి చేశారు. సరైన మోతాదులో మట్టిరేణువులను, ఇసుక రేణువులను కలపగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని సీఈవో ఓలే సివర్ట్‌సెన్ అంటున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఆ మోతాదు మారుతుందని, కాబట్టి స్థానికంగా ఉండే మట్టి రేణువులతోనే నానోక్లే తయారు చేయాలని తెలిపారు. గత పదేళ్లుగా తాము చైనా, పాకిస్థాన్, యూఏఈ, ఈజిప్ట్ దేశాల్లో ప్రయోగాలు చేసినపుడు ఒక దగ్గర బాగా పనిచేసిన నానోక్లే, మరో దేశంలో పెద్దగా ఫలితాలను చూపించలేదని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండే మట్టి రేణువుల కాటయానికి ఎక్స్‌చేంజ్ సామర్థ్యం మీద ఆధారపడి నానోక్లే ప్రభావం ఉంటుందని వివరించారు. అందుకే నానోక్లే అభివృద్ధి కోసం ఎక్కడిక్కడ చిన్న చిన్న ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed