గ్రేటర్‌లో జనసేన పోటీ ఈ పార్టీకే లాభమా?

by  |
గ్రేటర్‌లో జనసేన పోటీ ఈ పార్టీకే లాభమా?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని రాజకీయాల్లో చర్చ నడుస్తున్న టైంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించిన కొన్ని గంటలకే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేయడంతో నాలుగు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పీఠంపై ఉన్న టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు సాధించి.. మళ్లీ పీఠం దక్కించుకోవాలని చూస్తుండగా.. మొన్న దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం సాధించి ఊపుమీదున్న బీజేపీ సైతం బల్దియా కుర్చీపై నజర్ పెట్టింది. అటు.. కాంగ్రెస్ సైతం డివిజన్ల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించడంతో గ్రేటర్‌ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో ఫ్రెండ్ షిప్ చేస్తున్న పవన్ కల్యాణ్.. ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని, లేకుంటే మద్ధతు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటన చేసిన రెండు గంటల వ్యవధిలోనే గ్రేటర్ ఎన్నికల్లో తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో మరో చర్చ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీకి నష్టమా? లేక అధికార టీఆర్ఎస్‌కు నష్టమా? అనే చర్చ నడుస్తోంది. ఏపీలో ఈ రెండు పార్టీలు కలిసినడుస్తున్నాయి కనుక ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు చీలి ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశమే ఎక్కువనే వాదన ఉంది. ఫలితంగా జనసేన రంగంలో ఉండడం అనేది చివరకు కాంగ్రెస్ పార్టీకి లాభించవచ్చని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలా జరిగిన పక్షంలో గ్రేటర్‌లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే జరుగుతుందని వారు భావిస్తున్నారు. గ్రేటర్‌లో ఎక్కువ కార్పొరేటర్లు ఉన్న టీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ ఓట్లు అడుక్కోవచ్చని, ఇదేక్రమంలో మల్కాజిగిరికి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్పొరేటర్ల గెలుపు విషయంలో ప్రభావం చూపుతారని, దీంతో బీజేపీ, జనసేన ఓట్లు రెండుగా చీలిపోయి అటు కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

ఇన్నిరోజులు.. అధికార టీఆర్ఎస్‌తోనే కొట్లాడిన కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక విజయం తర్వాత రాజకీయంగా బీజేపీ నుంచి సైతం అదే రేంజ్‌లో పోటీ వస్తుండటంతో టఫ్ ఫైట్‌గా భావించింది. ఇన్నిరోజులు బీజేపీకి ఫేవర్‌గా ఉన్న జనసేన శ్రేణులు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు అటు ఇటు పడే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుందని హస్తంపార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం గ్రేటర్‌లో ఖచ్చితంగా ప్రభావం చూపుతామని.. నగరంలో పార్టీకి కార్యకర్తలతో పాటు అభిమానులు ఉన్నారని, అదేవిధంగా పవన్ ఇమేజ్ కలిసి వచ్చి గ్రేటర్‌లో ఎక్కువ సీట్లు సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ సైతం.. తమ ప్రధాన ప్రత్యర్థి ఎంఐంఎం అని ప్రకటిస్తూ ఎన్నికల రంగంలోకి దిగుతుండటంతో గ్రేటర్‌ ఎన్నికలు చలికాలంలో కూడా వేడి పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి వ్యూహాలు రచిస్తుండటంతో ఎన్నికలు దగ్గాపోరుగా కనపడుతున్నాయి. ఏదిఏమైనా బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు జోష్‌గా ఫీలవుతున్నాయి.

Next Story

Most Viewed