ఆక్రమణ రుజువు చేస్తే రాజీనామా చేస్తా

by  |
Minister Srinivas Gowd
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ ఆక్రమణలు చేసినట్టుగా రుజువు చేస్తే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ పాలకొండ దగ్గర 265/ఎ1 సర్వే నంబర్ లో ఐదు ఎకరాల 34 గుంటల భూమిని ఐదుగురు కొనుగోలు చేసిన తరువాత 6వ వ్యక్తిగా కొనుగోలు చేశానని చెప్పారు. ఎల్ఓసీ తీసుకొని, పాస్ బుక్ వచ్చిన తరువాత డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ దగ్గర అనుతులు తీసుకొని ఇళ్లు కట్టుకుంటున్నానని వివరించారు.

మహబూబ్‌నగర్ నుంచి కొందరు లుచ్చాగాళ్లు ఇచ్చిన సమాచారం ఆదారంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజన్ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ నిజానిజాలు తెలియకుండా దిగాజారి ఆరోపణలు చేయడాన్ని ప్రజలు హర్షించరని చెప్పారు. చరిత్ర తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బాధకరమన్నారు. భూ ఆక్రమణలు బయటపెట్టాలనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వేల ఎకరాల భూములపై పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ స్వరాష్ట్రం కోసం జైలుకు వెళ్లిన చరిత్ర తనదని గుర్తుచేశారు.

బీజేపీ నాయకులు అన్ని కులవృత్తులకు నష్టం చేకూర్చేలా వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలు నిర్మించడం, ఔటర్ రింగ్‌ రోడ్డులో అక్రమ వ్యాపారాలు చేయడం లేదాని ప్రశ్నించారు. బీసీ నాయకుడిగా చెప్పుకునే బండి సంజయ్ ఒక బీసీ మంత్రిపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. నా పాస్ బుక్ లో ఉన్నదాని కంటే ఒక్క గజం ఎక్కువ ఉన్నాకాని మొత్తం భూమిని దానం చేస్తానని చాలెంజ్ విసిరారు.

2014 కు ముందు మహబూబ్ నగర్ ప్రస్తుత మహబూబ్ నగర్ ఎలా ఉందో తెలుసుకోవాలని బండి సంజయ్ కు సూచించారు. అభివృద్ధిని ఓర్వలేక కొందరు మహబూబ్‌నగర్ బీజేపీ నాయకులు బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు చేసిన అక్రమాలు చెబితే బండారాలన్ని బయటపడుతాయని హెచ్చరించారు.



Next Story