తప్పటడుగే.. తల తీసేలా చేసిందా?

70

దిశ, నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణం అనంతసాగర్‌ గ్రామంలో జరిగిన మహిళ దారుణ హత్యకేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దారుణానికి ఒడిగట్టింది స్వయాన ఆమె భర్త సాయిలు అని పోలీసులు నిర్దారించారు. అనుసూయమ్మ (42) వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సాయిలు గొడ్డలితో భార్య మొండెం నుంచి తల వేరు చేశాడు. అనంతరం ఎవరితో అయితే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నదని అనుమానించాడో అతని ఇంటి ముందు తల పడేశాడు.

వివరాల్లోకివెళితే.. అనంతసాగర్ గ్రామానికి చెందిన జె.సాయిలు , అనుసూయమ్మ (42) భార్య భర్తలు. ఉపాధికోసం హైదరాబాద్‌‌కు వెళ్లి జ్యూస్ పాయింట్ పెట్టుకొని జీవనం సాగించారు. వీరికి ఒక కుమారుడు. ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా నెల రోజులు కిందట అనంతసాగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. భార్య పై అనుమానం పెంచుకోవడంతో దంపతులిద్దరీ మధ్య గత వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సాయిలు బుధవారం రాత్రి భార్యను గొడ్డలితో నరికి చంపాడు. తల, మొండెంను వేరు చేశాడు. మొండాన్ని గ్రామంలోనే ఉంచి, తలను నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా మందిర్ వద్ద అనసూయ ప్రియుడు జైపాల్రెడ్డి ఇంటి ముందు వదిలేసి వెళ్లాడు. ఘటనా స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ ఆర్‌ఎస్‌ఎం రాజు పరిశీలించారు. నిందితుడు సాయిలు నేరుగా పీఎస్‌లో లొంగిపోయాడు. అలాగే మృతురాలి ప్రియుడు జైపాల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో డీఎస్పీ వెంట సీఐ రవీందర్ రెడ్డి, ఎస్సై సందీప్ ఉన్నారు.