చిన్న సంస్థలను ఆదుకోవడంలో అడ్డంకులేంటి!

by  |
చిన్న సంస్థలను ఆదుకోవడంలో అడ్డంకులేంటి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వల్ల దెబ్బతిన్న దేశాల్లో కొన్ని యూరోపియన్ దేశాలతో పోలిస్తే చిన్న సంస్థలను రక్షించేందుకు ఇండియాలో ఆర్థిక ప్రయత్నాలు తక్కువగా జరుగుతున్నాయి. రూ. 3.74 లక్షల కోట్ల లిక్విడిటీ ప్యాకేజీ బ్యాంకులకు విస్తరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయం గుర్తించదగిన చర్య. అయినప్పటికీ పరిశ్రమలకు అందాల్సినంత వేగంగా అవి చేరడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో దెబ్బతిన్న దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు చిన్న వ్యాపారులను రక్షించేందుకు త్వరగా స్పందిస్తున్నాయి. స్పెయిన్‌లో కొత్త రుణాలకు 80 శాతం వరకూ హామీని ఇస్తుంటే… కరోనా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొంటున్న జర్మనీలో అన్ని రకాల రుణాలకు 90 శాతం హామీని ఇస్తున్నాయి. అదేవిధంగా..ఫ్రాన్స్, ఇటలీ, మరికొన్ని దేశాలు వ్యాపారులకు సాయం చేసేందుకు రుణ శాతాన్ని పెంచుతున్నాయి. ఆస్ట్రేలియాలో కూడా చిన్న రుణాలపై 50 శాతం వరకూ హామీని అక్కడి ప్రభుత్వం అందిస్తోంది.

ఇండియాలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థల(ఎమ్ఎస్ఎమ్ఈ)కు ఇదివరకు ఇచ్చిన రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నందున బ్యాంకులు కొత్త రుణాలపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఎమ్ఎస్ఎమ్ఈల కోసం అత్యవసర క్రెడిట్ లైన్‌లను తెరిచాయి. అయితే, ఔట్‌ఫ్లో మాత్రం ఆర్థికంగా బలమైన సంస్థలనే ఎంపిక చేస్తున్నాయి. ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన ఎకనామిక్ టాస్క్‌ఫోర్స్ ఇప్పుడు ద్రవ్య లభ్యతను పెంచాల్సి ఉంది. తద్వారా నిధులు ఎమ్ఎస్ఎమ్ఈలకు చేరతాయి.

ప్రభుత్వం.. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) భాగస్వామ్యంతో తక్కువ రుణాలపై హామీని ఇచ్చేందుకు సిద్ధమైంది. అంటే, నిర్ణీత శాతం హామీని ఇవ్వడం(పెరుగుతున్న రుణంలో 25 నుంచి 80 శాతం వరకూ), ఫ్లాట్ ఫిక్స్‌డ్ ఇక్రిమెంట్ లోన్ మొత్తానికి హామీ ఇవ్వడం లాంటి పరిణామాలు భరోసాని ఇస్తున్నాయి. అయితే, రుణాలిచ్చే సంస్థలకు ప్రభుత్వం హామీ ఇవ్వడానికి ఉన్న పెద్ద అవరోధం బడ్జెట్ పరిమితి. ప్రస్తుతం ఎమ్ఎస్ఎమ్ఈలకు బ్యాంకులు ప్రాధాన్యతా రంగంతో సహా అన్ని రంగాలకు హామీని ఇస్తున్నాయి. గ్యారెంటీ కవర్ అంటే పెరుగుతున్న రుణాలకు సుమారు 12 శాతం మద్దతు ఇస్తున్నాయి.

మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పెరుగుతున్న రుణాలలో నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని సూచించారు. అయితే, ఎమ్ఎస్ఎమ్ఈలు గత సంవత్సరం చెల్లించిన ఆదాయపు పన్ను మొత్తాన్ని బట్టి రుణ హామీని ఇవ్వాలని సలహా ఇచ్చారు. ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రభుత్వ హామీ ప్రయోజనాలను ఎవరు పొందాలనే దానిపై సందేహాలున్నాయి. ఎఫ్ఎమ్‌సీజీ, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం వంటి అవసరమైన సేవలను అందించే రంగాల్లోని ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

బ్యాంకు రికార్డుల్లో ఎగవేతల చరిత్ర ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈలను, రూ. 25 కోట్ల రుణ పథకం కింద ప్రయోజనాలను పొందిన వాటిని మినహాయించాలి. ఎమ్ఎస్ఎమ్ఈలు గడిచిన ఐదేళ్లుగా కఠినమైన్న సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చాలా పెద్ద సంస్థలే దివాళ తీసిన పరిస్థితులను చూశాం. ఆర్థిక వ్యవస్థ మందగమనం చిన్న సంస్థల ఆదాయ మార్గాలను ప్రభావితం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జీడీపీలో 30 శాతం వాటా అందిస్తున్న చిన్న సంస్థలను ప్రభుత్వం సరైన ప్రణాళికతో ఆదుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.

Tags : RBI Liquidity Package, Economic Task Force, Liquidity, Reserve Bank Of India, Economic Package To MSME


Next Story