పెట్టుబడులకు గోల్డెన్ ఛాయిస్

by  |
పెట్టుబడులకు గోల్డెన్ ఛాయిస్
X

ముంబయి: బంగారం ఇప్పుడు అతిపెద్ద పెట్టుబడి సాధనం. కొవిడ్-19 సంక్షోభం వల్ల నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారుల ఆసక్తి బంగారంపైనే ఉంది. ప్రస్తుత బంగారం ధరలు, డిమాండ్ వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకుని బంగారమే సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 పెట్టుబడి సాధనాల్లో బంగారం కూడా చోటు సంపాదించుకోవడం విశేషం. టాప్ 5 పెట్టుబడుల్లో లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ బ్యాంక్, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు, జ్యువెలరీ, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. 2016లో పెట్టుబడిదారుల సగటు సంపాదనలో 28 శాతాన్ని పెట్టుబడిగా పెడితే, 2019 నాటికి అది 33 శాతానికి పెరిగింది. ఇతర సాధనాల కంటే బంగారాన్ని సులువుగా కొనుగోలు చేసే వీలుండటమే ఎక్కువమంది బంగారంపై అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కారణమని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఈజీ మనీ వెసులుబాటు

అంతర్జాతీయంగానే కాకుండా, మనదేశంలోనూ బంగారంపై పెట్టుబడి రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే ఎక్కువమంది భావిస్తారు. ఇదే సమయంలో రాబడి కూడా అధికంగా ఉంటుందని వారు భావిస్తున్నట్టు తేలింది. పెట్టుబడిదారులు బంగారాన్ని ఆదాయ మార్గంగానూ, తక్కువ సమయంలో నగదుగా మార్చుకునే సాధనంగానూ, భవిష్యత్తులో తిరిగి పెట్టుబడిగా మార్చుకునేందుకు అవకాశంగానూ చూస్తున్నట్టు నిర్ధారణ అయింది.

ఎవరు చెప్తే కొంటున్నారు..

ఇక, బంగారాన్ని ఏయే రూపాల్లో కొనుగోలు చేయడానికి ప్రభావితమవుతున్నారనే అంశాన్ని అధ్యయనం పరిశీలించింది. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువమంది బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యుల సలహాలపై ఆధారపడుతున్నట్టు అధ్యయనం తేల్చింది. ఈ సర్వేలో స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల సలహాల ద్వారా 50 శాతం మంది పసిడి కొనుగోలు చేస్తున్నారు.

ఫైనాన్షియల్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా 47 శాతం మంది కొంటుంటే, ఫైనాన్షియల్ పత్రికలు, మ్యాగజైన్ల ద్వారా 43 శాతం మంది, టీవీల ద్వారా 39 శాతం, సోషల్ మీడియా ద్వారా 38 శాతం, ఆర్థిక సలహాదారులు, బ్రోకర్లు, పెట్టుబడి నిపుణుల ద్వారా 41 శాతం, ఫండ్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 34 శాతం, బ్లాగులు, ఆన్‌లైన్ ఫోరమ్‌ల ద్వారా 29 శాతం, బ్యాంక్ నుండి ప్రతినిధుల ద్వారా 28 శాతం మంది కొనుగోలు చేస్తున్నట్టు నిర్ధారణ అయింది.

29 శాతం మంది కొనట్లేదు

దేశీయంగా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా కొనేవారు ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లోని వారిలో 29 శాతం మంది ఇప్పటివరకూ ఒక్కసారి కూడా బంగారం కొనలేదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. బంగారం కొనడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడం, మోసపోతామనే ఆందోళన, ఇతరత్రా కారణాలుగా అధ్యయనం వెల్లడించింది. కానీ, మారుతున్న పరిస్థితుల్లో మార్కెట్ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో బంగారం నిరంతర పెట్టుబడి సాధనంగా మారుతున్నట్టు అధ్యయనం స్పష్టం చేస్తోంది.

రూ. 50 వేలకు చేరువలో…

సోమవారం ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.47,865 పలకడం చూస్తే మిగిలినవాటి కంటే బంగారంపైనే ఎక్కువమందికి ఆసక్తి ఉన్నట్టు స్పష్టమవుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే 3 శాతం పెరిగి కిలో రూ.48,208 వద్ద ట్రేడయింది. వారం రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధర 3.40 శాతం, వెండి దాదాపు 8 శాతం పెరగడం గమనార్హం. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అమెరికా, జపాన్ దేశాల బలహీన ఎకానమిక్ డేటా తదితర కారణాలతో సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బంగారం ధరలు కొండెక్కాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం ధరలు 22 క్యారెట్ల బంగారం రూ.45,480కి పెరగ్గా, 24 క్యారెట్ల బంగారం 48,550కి చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే, బంగారం ధరలు హైదరాబాద్‌లో రూ.50వేల మార్కును చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed