పుదుచ్చేరిలో రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు.. ఎందుకో తెలుసా..?

by  |
పుదుచ్చేరిలో రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు.. ఎందుకో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్ : ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్య్ర దినోత్సవం. కానీ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఆగస్టు 15 వేడుకలు ఆగస్టు 16న కూడా కొనసాగుతాయి. ఎందుకంటే ఆ రోజు ‘డి జ్యూర్ ట్రాన్స్‌ఫర్ డే’ను జరుపుకుంటారు. ఆగస్టు 16 ఈ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేకమైంది. ఎందుకో తెలుసుకోవాలంటే.. 59 ఏళ్ల క్రితం ఏమి జరిగిందో తెలుసుకోవాలి.

భారతీయులు స్వాతంత్య్రం పొందిన 15ఏళ్ల తర్వాత అంటే 1962 ఆగష్టు 16న ఫ్రెంచ్ కాలనీ నుంచి విముక్తి చెంది యూనియన్ ఆఫ్ ఇండియాలో పుదుచ్చేరి విలీనమైంది. అది నిజంగా స్వాతంత్ర్యం పొందిన రోజు కావడంతో ఇక్కడి ప్రజలు ‘డి జ్యూర్ ట్రాన్స్‌ఫర్ డే’గా జరుపుకుంటున్నారు. అక్కడ ఈరోజు హాలీడే.

భారతదేశంలోని ఇతర ప్రాంతాలు స్వేచ్ఛగా ఉన్నప్పుడు కూడా 1947 తర్వాత అప్పటి పాండిచ్చేరి ఫ్రెంచ్ నియంత్రణలో ఉండగా, స్వేచ్ఛా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్కడ నిరసనలు పెరిగాయి. దాంతో మార్చి 13, 1954 ఫ్రెంచ్ భూభాగాల పరిష్కారంపై చర్చలు ప్రారంభం కాగా, పుదుచ్చేరి పరిధిలోని ఒక మారుమూల గ్రామమైన కిజూర్‌ను అప్పటి ఫ్రెంచ్ పాలకులు భారత అధికారులతో చర్చల కోసం ఎంచుకున్నారు. ఇది పూర్తిగా ఫ్రెంచ్ నియంత్రణలో ఉన్న పుదుచ్చేరిలోని ఏకైక సరిహద్దు ప్రదేశం.

అక్టోబర్ 18, 1954న విలియనూరు సమీపంలోని కీజూర్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఫ్రెంచ్‌తో ఉండాలనుకుంటున్నారా లేదా ఇండియన్ యూనియన్‌లో చేరాలనుకుంటున్నారా అని అడగ్గా 178 మంది ప్రతినిధులలో 170 మంది తాము భారతదేశంలో చేరాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు 1956లో ఫ్రెంచ్ నియంత్రణ నిలిపివేత ఒప్పందంపై సంతకం చేయడంతో ప్రక్రియ ముగిసింది. కానీ ఫ్రెంచ్, భారత ప్రభుత్వం మధ్య సంతకం చేసిన ఒప్పందాన్ని ఫ్రెంచ్ పార్లమెంట్ ఆగష్టు 16, 1962న ఆమోదించింది.

1726 లో ఫ్రెంచ్ వారు పుదుచ్చేరిని ఆక్రమించారు. వాస్తవానికి దీనికి తమిళ పేరు పుటుచ్చేరి. పుటు అంటే కొత్తది. సెరి అంటే గ్రామం. ఆ పేరును భ్రష్టుపట్టించిన ఫ్రెంచ్‌వారు తర్వాత పుదుచ్చేరి అని పేరు మార్చారు. ఇది ఫ్రెంచ్, బ్రిటిష్ వారి మధ్య చేతులు మారినా ప్రధానంగా ఫ్రెంచ్ భూభాగంగానే ఉంది.

Next Story

Most Viewed