సాగర్‌ అభ్యర్థిపై బీజేపీలో నో క్లారిటీ… కారణం అదేనా?

402
sagar by polls

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలతో దూకుడు పెంచిన బీజేపీ ముందు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీని.. మరోవైపు జానారెడ్డిని ఎదుర్కొంటూనే సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అయితే దీని కోసం పార్టీలో మూడు ముక్కలాట నెలకొంది. బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తుంటే… ఇటీవల దుబ్బాకలో గెలిచి, పార్టీలో వర్గాన్ని పెంచుకుంటున్న రఘునందనరావు టీం మరోకరికి మద్దతుగా ఉంటోంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఎటూ తేల్చక సర్వేలతో జాబితా సిద్ధం చేసుకుంటోంది. ఈ ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికే కమలం పార్టీకి కీలకం కానుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటూ.. తామే బరిలో ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఆశించి భంగపడేవారు ఎవరికైనా గాలం వేస్తారా? లేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని బరిలో దించుతారా అన్నది ఇప్పటి వరకు ఆసక్తిగానే ఉంది. సాగర్​లో త్రిముఖపోటీ ఉంటుందని, కచ్చితంగా ఓట్లు చీలతాయని, దీని ప్రకారమే ఎన్నికల వ్యూహం రచించాలని బీజేపీ అధిష్టానం హెచ్చరికలు చేస్తోంది. అంతేకాకుండా జానారెడ్డి ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదని, ఏదైనా బీజేపీ అభ్యర్థి గెలుస్తారనే ధీమాతో కూడా ఉన్నారు. టీఆర్​ఎస్​ ఎవరికి టికెట్​ ప్రకటిస్తుందో తేలిన తర్వాతే అభ్యర్థిని ఖరారు చేయాలని అటు కేంద్ర అధిష్టానం సూచిస్తోంది.

రాష్ట్రంలో దుబ్బాక‌ ఉప ఎన్నిక, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పుడు అంద‌రి చూపు సాగ‌ర్ ఉప ఎన్నిక మీదే ఉంది.ఇక్క‌డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యం, ఇటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ జోరుకు చాలా దూరంలో ఆగిపోవడంతో సాగర్​లో ఎలాంటి తీర్పు వస్తుందనేది హాట్​ టాపిక్​గా మారింది. కాంగ్రెస్​ పార్టీ కంచుకోటగా భావించే ఈ సెగ్మెంట్​లో 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నోముల నర్సింహ్మయ్య… జానారెడ్డిపై 7 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలన్ని ఇక్కడ కన్నేసినా… బీజేపీకి మాత్రం అభ్యర్థి ఖరారులోనే ఇబ్బందులు వస్తున్నాయి.

మూడు వర్గాలు..

రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కమలం వికసిస్తోంది. వచ్చే 2023లో రాష్ట్రంలో జెండా ఎగురవేస్తామని తీరుతో బీజేపీ శ్రేణులు ప్లాన్​ వేసుకుంటున్నారు. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్​లో గెలుపుతో జోరు మీదున్నారు. ఇదే సమయంలో నాగార్జున సాగర్​లో వస్తున్న ఉప ఎన్నికలో కూడా విజయపరంపర కొనసాగించి గాలివాటం కాదని… ప్రత్యామ్నాయం మేమేననే సంకేతాలివ్వాలని భావిస్తోంది. అయితే సాగర్​లో అభ్యర్థి కోసం చాలా ప్రయత్నాలు సాగుతున్నాయి.

కాషాయ దళపతి బండి సంజయ్​ ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. దీని కోసం ఇటీవల కాంగ్రెస్​ నుంచి బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి, యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజయ్య యాదవ్​కు టికెట్​ ఇచ్చే అంశంపై చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి సైతం సూచించారు. వాస్తవంగా బీసీల ఓట్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ రెడ్డి ఆధిపత్యానికి బ్రేక్​ వేసింది బీసీ నేతే కావడంతో ఈసారి కూడా అదే ప్లాన్​ అమలు చేయాలనుకుంటోంది.

మరోవైపు దుబ్బాకలో గెలిచి, రాష్ట్రంలో మరో నేతగా ఎదుగుతున్న రఘునందన్​రావు ఇప్పుడు సాగర్​పై దృష్టి పెట్టారు. సాగర్​ ఉప ఎన్నికల్లో కూడా గెలిచి తీరాలనే ప్రణాళిక చేస్తోంది. దీనిలో భాగంగా గతంలో ఆ పార్టీ నుంచి గెలిచి ఓడిపోయిన నివేదితా రెడ్డికే టికెట్​ ఇవ్వాలని అధిష్టానానికి సూచించారు. అయితే నివేదితా రెడ్డికి గతంలో కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, టికెట్​ ఇస్తే చాలా కష్టపడాల్సి వస్తుందని సంజయ్​ వర్గం చెప్పుతోంది. కానీ రఘునందనరావు టీం మాత్రం నివేదితారెడ్డికే సపోర్టు చేస్తున్నారు. అయితే నివేదితా రెడ్డి సొంతంగా చేసుకున్న సర్వేలో 28 శాతం ఓట్లు వస్తాయని తేలిందని నివేదించారు. కానీ దీన్ని ఏ మేరకు పార్టీ పరిగణలోకి తీసుకుంటుందో తేల్చి చెప్పడం లేదు.

అధిష్టానం చేతిలో మరో జాబితా..

బీజేపీ కేంద్ర అధిష్టానం సాగర్​ ఉప ఎన్నికల కోసం ప్రత్యేక సర్వే బృందాలను రంగంలోకి దింపింది. రెండు దఫాలుగా సర్వేలు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ తరుణ్​ చుగ్​ ఇప్పటికే ఈ అంశంపై పార్టీ శ్రేణులతో చర్చించారు. బీజేపీ కేంద్ర అధిష్టానం చేసిన సర్వేలో కూడా నివేదితా రెడ్డికి 25 నుంచి 28 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలినట్లు సమాచారం. అయితే బీసీ అభ్యర్థిపై కూడా సర్వే చేసుకున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. ఇలా ముగ్గురు నేతలపై సర్వే చేసుకున్న అధిష్టానం ఇంకా అభ్యర్థి ఖరారుపై నిర్ణయం తీసుకోవడం లేదు. అటు సంజయ్​ నివేదికలు, ఇటు రఘునందనరావు నివేదికలను తీసుకుని పరిశీలన చేస్తోంది.

టీఆర్​ఎస్​ టికెట్​ ఆధారంగానే పరిశీలన..?

ఇంకోవైపు సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అధికార టీఆర్‌ఎస్‌ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కారు పార్టీ.. ఇక్కడ విజయం సాధించి బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలనుకుంటుంది. ప్రస్తుతం సానుభూతి పని చేయడం లేదని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్​రెడ్డి, నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు, ఎంసీ కోటిరెడ్డి, తెరా చిన్నపరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్లు పరిశీలిస్తున్నట్టు పార్టీ నేతలు చెప్పుతున్నారు. అయితే సాగర్‌ ఉప ఎన్నికపై ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ అంతర్గత సమావేశంలో సీఎం కేసీఆర్‌ మైండ్​ గేమ్​ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఎడ్జ్‌ ఉందని చెప్పడంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఆడుతున్న మైండ్‌ గేమ్‌లో భాగమని, నిజంగానే కాంగ్రెస్‌ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటే టీఆర్​ఎస్​ ఆ వైపు ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అదే ప్లాన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీఆర్​ఎస్​ కూడా రెడ్డి వర్గానికి టికెట్​ ఇస్తే… బీజేపీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపుతుందని పార్టీ నేతలు చెప్పుతున్నారు. టీఆర్​ఎస్​ కూడా బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే… బీజేపీ ఏం చేయాలనే అంశం కేంద్ర అధిష్టానం నుంచి రావాల్సి ఉందంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..