పాడైన వాహనాలకు బాధ్యులెవరు..?

by  |
పాడైన వాహనాలకు బాధ్యులెవరు..?
X

వాహన తనిఖీల్లో పట్టుబడిన బండ్లు పోలీస్ స్టేషన్లలో ఆవరణలో తుప్పు పట్టి పోతున్నాయి. బతుకుదెరువు కోసం కొత్తగా నగరానికి వచ్చిన వారు కొందరు. మధ్యం సేవించి పట్టుబడిన వారు మరికొందరు, అత్యవసర సమయంలో లైసెన్స్ లేకుండా స్నేహితుల వాహనాలు తీసుకెళ్తుండగా మరికొందరూ ఇలా ఏదో ఒక కారణంతో పట్టుబడుతున్నారు. ఈ వాహనాలను పోలీసులు స్టేషన్ ఆవరణలో ఉంచడంతో ఎండకు ఎండుతూ.. వానలకు తడుస్తూ జంగు పడుతున్నాయి. వాహనాలు ఆగమైతున్నయని, తమ వాహనాలు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

దిశ, కుత్బుల్లాపూర్ : ఓ యువకుడు బతుకుదెరువు కోసం కొత్తగా నగరానికి వలస వచ్చి సుచిత్రలో నివాసముంటున్నాడు. వచ్చిన మరునాడే లైసెన్సు లేదని వాహనం సీజ్ చేశారు. మరొకరు సార్ తెలిసో.. తెలియకనో మధ్యం సేవించి పట్టుబడ్డాడు. అత్యవసర సమయంలో లైసెన్స్ లేకుండా మా స్నేహితుడి బైక్ తీసుకుని వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఇలా పట్టుబడిని ద్విచక్ర వాహనాలు బాధితులు చలానా కట్టో… న్యాయమూర్తి చెప్పిన విధంగా శిక్ష అనుభవించో తీసుకెళ్దామంటే న్యాయమూర్తి సెలవులో ఉన్నారని పోలీసులు కొన్ని రోజులు ఆగాలనే సమాధానాలు చెప్తున్నారు. ఉన్న ఒక వాహనం పోలీసులు సీజ్ చేయగా మరో వాహనం కొనుగోలు చేయలేని వారు సైతం ఉన్నారు. ఇలా వందలాది మంది వాహనదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

సైబరాబాద్ పరిధిలోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్వాల్, పేట్ బషీరాబాద్, మేడ్చల్, శామీర్ పేట లా అండ్ ఆర్డర్ పీఎస్ లు ఉన్నాయి. నాలుగు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతోపాటు లైసెన్సులు లేకపోవడం, మైనర్లు నడపడం తదితర కారణాల వల్ల ట్రాఫిక్ పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాలను మళ్లీ తీసుకోవాలంటే కోర్టుకు హాజరై న్యాయమూర్తి వేసిన పరిహారం చెల్లించడం లేదంటే జైలు శిక్ష అనుభవించి వాహనాలను తీసుకెళ్లొచ్చు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి రెండు నెలల పాటు మేడ్చల్ న్యాయమూర్తి సెలవులో ఉన్నారని, వాహనాలను తిరిగి తెచ్చుకోలేని పరిస్థతి ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి కరోనాతో లాక్ డౌన్ విధించడంతో కోర్టులు పూర్తిగా పని చేయలేదు. ఇలా ఎనిమిది నెలలుగా వాహనాలన్నీ పీఎస్ లో పెరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 800వాహనాల వరకు సీజ్ చేయగా పీఎస్ లోనే ఉన్నాయి.

పాడవుతున్న వాహనాలు…

గత ఎనిమిది నెలల క్రితం సీజ్ చేసిన వాటితోపాటు ప్రస్తతం సీజ్ చేసిన వాహనాలన్నీ స్టేషన్ ఆవరణలోనే ఉన్నాయి. వీటిని తీసుకోవాలంటే కోర్టులు పని చేయాల్సిందే. కానీ నవంబర్ వరకు కోర్టులు ఓపెన్ కాకపోవడంతో వాహనాలు తీసుకోవడం సాధ్యం కాదు. దీంతో పేరుకుపోయిన వాహనాలు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తప్పు పడుతున్నాయి. సీట్లు చిరిగిపోయి ముఖ్యమైన విభాగాలు పాడవుతున్నాయి. వాహనాలు పాడైతే ఎవరూ బాధ్యత వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

మొబైల్ కోర్టులతో సమస్యకు చెక్…

కోర్టులు తెరుచుకోకపోవడంతో పెండింగ్ లో ఉన్న వాహనాలను వాహనదారులు తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రతి ట్రాఫిక్ పీఎస్ ఆవరణలో మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఒక న్యాయమూర్తి, బెంచ్ క్లర్క్ ను కేటాయిస్తే పీఎస్ కు చెందిన సిబ్బంది సహకారంతో ప్రతి రోజు 150కు పైగా వాహనాల కేసులను పరిష్కరించవొచ్చు. జరిమానాలు కడుతాం, జైలు శిక్ష అనుభవించైనా వాహనాలు తెచ్చుకుంటాం. కానీ పాడైతే ఏం వస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్వాల్ ట్రాఫిక్ పీఎస్ ఆవరణలో ఉన్న వాహనాలకు సంబంధించిన కేసులను పరిష్కరిస్తే దాదాపుగా రూ.10లక్షల నుంచి రూ.13లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలేస్తున్నారు.



Next Story

Most Viewed