ఇంగ్లాండ్‌తో ఎవరిని ఆడిద్దాం..?

by  |
ఇంగ్లాండ్‌తో ఎవరిని ఆడిద్దాం..?
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించి మంచి ఉత్సాహంతో ఉన్న టీమ్ ఇండియాకు అసలైన పరీక్ష స్వదేశంలో ఎదుర్కొనోనుంది. విదేశాల్లో వరుసగా టెస్టు సిరీస్‌లు గెలుస్తున్న ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్నది. మరో మూడు రోజుల్లో చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. తుది జట్టులో ఎవరిని ఆడించాలో అర్దం కాక టీమ్ ఇండియా యాజమాన్యం మల్లగుల్లాలు పడుతున్నది. ఇంగ్లాండ్ జట్టును అంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. గతంలో టీమ్ ఇండియాను స్వదేశంలోనే మట్టి కరిపించిన రికార్డు ఉన్నది. ఆస్ట్రేలియాలో పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి కాబట్టి తుది జట్టులో ఒకే స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు ఆల్ రౌండర్లు కావడంతో పార్ట్ టైంలో వారి సేవలను వాడుకున్నది. అయితే ఇండియాలో పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. తొలి రోజు బౌన్సీగా ఉండి పేసర్లకు అనుకూలించి.. రోజులు గడిచే కొద్దీ పిచ్‌లు నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలంగా మారిపోతాయి. దీంతో ఇద్దరు స్పిన్నర్లతో దిగాలా లేదా ఆసీస్‌లో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలా అనే సందేహంలో పడింది.

స్పిన్నర్లుగా ఎవరు?

తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్‌గా సేవలందించడం ఖాయమే. అయితే అతడికి తోడుగా రెండో స్పిన్నర్ ఎవరనేది ప్రశ్నార్దకంగా మారింది. ఆసీస్‌లో బెంచ్‌కే పరిమితం అయిన కుల్దీప్ యాదవ్‌ను తొలి టెస్టులో ఆడించాలా వద్దా అనేది సందిగ్దంగా మారింది. కుల్దీప్‌కు ఇండియాలోని పిచ్‌లపై మంచి రికార్డే ఉన్నది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ స్పిన్‌ను సమర్దవంతంగా ఎదుర్కుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయితేనే వీరిని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో వీరిని అడ్డుకోవడం కాస్త కష్టం. వీరి వికెట్లు స్పిన్నర్లు తీయగలరు. కాబట్టి అశ్విన్‌కు తోడుగా అనుభవం ఉన్న కుల్దీప్ అయితేనే స్పిన్ బలం పెరుగుతుందని భావిస్తున్నారు. ఒక వేళ యాజమాన్యం స్నిన్నర్‌గా కుల్దీప్‌కు తుది జట్టులో అవకాశం ఇస్తే శార్దుల్ ఠాకూర్‌ బెంచ్‌కే పరిమితం కావల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై బయోబబుల్‌లో ఉన్న కుల్దీప్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శార్దుల్ కంటే కుల్దీప్‌నే తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆల్‌రౌండర్ ఎవరు?

ఆసీస్ పర్యటనలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడి ఇంగ్లాండ్ పర్యటనకు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ జరుగుతున్నది. గబ్బా టెస్టులో రవీంద్ర జడేజా స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ అంచనాలను మించి రాణించాడు. బంతితోనే కాకుండా బ్యాటుతో కూడా అద్బుతంగా రాణించాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అక్షర్ పటేల్‌కు మంచి రికార్డు ఉన్నది. అక్షర్ తొలి సారిగా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఒక టెస్టు సీనియర్ అయిన సుందర్ ఇప్పటికే తన సత్తా ఏంటో చూపించాడు. విదేశీ గడ్డపై కఠినమైన పరిస్థితుల్లో జట్టు అవసరాలకు తగినట్లు ఆడటంతో అతడి వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉన్నది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా టీమ్ ఇండియా ఆడుతున్న చివరి టెస్టు సిరీస్ కావడంతో ఇక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ విజయాలు సాధిస్తేనే ఫైనల్స్‌లో చోటు లభిస్తుంది. కాబట్టి అందుకు తగినట్లుగా బలమైన ఇంగ్లాండ్‌ను ఎదుర్కునే జట్టును ఎంపిక చేయాల్సి ఉన్నది.

తుది జట్టు అంచనా :

రోహిత్ శర్మ, శుభమన్‌గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా.



Next Story

Most Viewed