బరిలో ఆ ముగ్గురు.. ఫ్రెంచ్ ఓపెన్ ఎవరిది?

by  |
బరిలో ఆ ముగ్గురు.. ఫ్రెంచ్ ఓపెన్ ఎవరిది?
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్‌లో ఎన్నో టోర్నీలు జరిగినా నాలుగు ఓపెన్ టోర్నీలను మాత్రమే గ్రాండ్‌స్లామ్స్ అని పిలుస్తారు. ప్రతీ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలు పెడితే ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌తో నాలుగు గ్రాండ్ స్లామ్స్ పూర్తి అవుతాయి. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ షెడ్యూల్ ప్రకారమే జరిగినా ఫ్రెంచ్ ఓపెన మాత్రం కాస్త ఆలస్యంగా నిర్వహించారు. వింబుల్డన్ పూర్తిగా రద్దు కాగా, చివరిలో యూఎస్ ఓపెన్ చాలా కొద్ది మంది ఆటగాళ్లతో జరిగింది. మొత్తానికి 2020 టెన్నిస్ సీజన్ కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ నిబంధనల కారణంగా అస్తవ్యస్థంగా సాగింది. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ షెడ్యూల్ ప్రకారమే జరిగినా.. ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ విజృంభించడంతో పలు ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. రోలాండ్ గారోస్‌లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ కూడా రెండు వారాల ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. కాగా, ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్‌ను టెన్నిస్ అభిమానులే కాకుండా.. చాలా మంది విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు.

నదాల్ సాధిస్తాడా?

ఓపెన్ ఎరాలో జరిగిన గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన క్రీడాకారులుగా రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ సమ ఉజ్జీలుగా ఉన్నారు. రోజర్ ఫెదరర్ రెండేళ్ల క్రితమే 20 టైటిల్స్ గెలుచుకొని పురుషుల సింగిల్స్‌లో రికార్డు సృష్టించాడు. అయితే క్లే కింగ్, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి రోజర్ ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లామ్స్ రికార్డును సమం చేశాడు. గాయం కారణంగా ఫెదరర్ రెండేళ్లుగా టెన్నిస్ ఆడటం లేదు. అయితే నదాల్ మాత్రం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడినా క్వార్టర్ ఫైనల్స్‌లో సిట్సిపాస్ చేతిలో ఓడిపోయి తన గ్రాండ్‌‌స్లామ్ రికార్డును చేరుకోలేక పోయాడు.

అప్పటి నుంచి నదాల్ ఓపెన్ ఎరా రికార్డు కోసం సాధన చేస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సన్నాహంగా చెప్పుకునే పలు క్లే కోర్ట్ టెన్నిస్ టోర్నీలలో నదాల్ పాల్గొన్నాడు. అందులో ఇటాలియన్ ఓపెన్ మాత్రమే గెలుచుకున్నాడు. మరోవైపు వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ కూడా పెద్దగా రాణించలేక పోయాడు. ఇక రోజర ఫెదరర్ రెండేళ్ల తర్వాత జెనీవా ఓపెన్ బరిలో దిగి రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఈ మధ్య జరిగిన టోర్నీలను పరిశీలస్తే నదాల్ మాత్రమే ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నది.

రోలాండ్ గారోస్ హీరో..

ఫ్రెంచ్ ఓపెన్ జరిగే రోలాండ్ గారోస్‌లో రఫెల్ నాదాల్‌ది తిరుగు లేని రికార్డు. ఇప్పటి వరకు 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. క్లే కోర్టులో నదాల్‌ను మించిన టెన్నిస్ ప్లేయర్ లేడు. ఇటాలియన్ ఓపెన్, మాంటీకార్లో వంటి ఏటీపీ 1000 టూర్లలో కూడా నదాల్‌దే రికార్డు. తొలి సారిగా 2005లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన నదాల్ గత 16 ఏళ్లలో 13 సార్లు విజేతగా నిలిచాడంటే అతడి రికార్డు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక హార్డ్ కోర్ట్ యూఎస్ ఓపెన్‌‌లో నాలుగు సార్లు గెలిచాడు. అయితే నదాల్‌కు గ్రాస్ కోర్డుపై కలిసి రాలేదు. తన కెరీర్‌లో కేవలం 2008, 2010లో మాత్రమే వింబుల్డన్‌ను గెలిచాడు. కాగా, ఈ సారి రికార్డు స్థాయలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకోవడమే కాకుండా.. ఓపెన్ ఎరాలో 21వ సారి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాలని నదాల్ భావిస్తున్నాడు. మరోవైపు వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ కూడా నదాల్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జకోవిచ్.. క్లేకోర్టులో నదాల్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్నాడు.



Next Story

Most Viewed