దుబ్బాకలో గెలిచేది ఆ పార్టేనట..?

by  |
దుబ్బాకలో గెలిచేది ఆ పార్టేనట..?
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక సీటును ఎవరు కైవసం చేసుకుంటారు..? అభివృద్ధి జపం చేస్తున్న అధికార పార్టా..? లేక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బరిలో దిగిన బీజేపీనా.. లేక గత అభివృద్ధిని చూపిస్తున్న కాంగ్రెస్ పార్టా..? రాష్ర్టంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి పక్షాన నిలవనున్నారు.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘దిశ’ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే..!

సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ఈ నెల 3న ముగిసినప్పటికీ ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. అత్యంత ప్రతిష్టాత్మక దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎవరికీ వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే, ఓటర్లు ఎవరికి వేశారో మాత్రం ఖచ్చితంగా ఎవరూ అంచనా వేయలేక పోతున్నారు. భారీగా పెరిగిన ( 82 శాతంకు పైగా ) ఓటింగ్ శాతం అధికార పార్టీకి కలిసి వస్తుందా ? ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుందా ? అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

దుబ్బాక ఉప ఎన్నికలపై ఆంధప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బై పబ్లిక్ పల్స్ అనే సంస్థ తన సర్వే రిపోర్టును వెలువరించింది. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ షాక్ ఇవ్వడం ఖాయమని ప్రచురించింది. దుబ్బాకలో టీఆర్ఎస్ కు 42.5 శాతం ఓట్లు వస్తే .. బీజేపీకి 45.2 శాతం వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్‌కు 11.7 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీనే విజయం సాధిస్తుందని.. అయితే ఓట్ల తేడా 4 వేల నుంచి 6 వేల మధ్య ఉండనుందని పేర్కొంది. థర్డ్ విజన్ అనే సంస్థ మాత్రం దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ విజయం భాయమని చెప్పింది.

ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా .. కౌంటింగ్ పక్రియ ముగిస్తేనే విజేత ఎవరనేది తేలుతుంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలూ గెలుపు మాదే అంటే మాదే అంటూ దుబ్బాక శాసనసభా నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాన్ని ఉత్కంఠ భరితంగా మార్చేశాయి. గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో ఈ నెల 3న పోలింగ్ లో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుండగా ప్రచారం తీరుతెన్నులను పోలింగ్ సరళి, గెలుపోటములపై ప్రధాన రాజకీయ పక్షాలు విశ్లేషణ జరుపుకుంటున్నాయి . సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామనే ధీమా టీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్ లు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి.

కంచుకోటలో గెలుపు మాదికాక మరెవరిదంటూ టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు ఓటింగ్ రూపంలో కలిసి వచ్చాయని టీఆర్ఎస్ శిబిరం అంచనా వేస్తోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ప్రచార పర్వంలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు తర్వాతి కాలంలో పార్టీ రాష్ట్రస్థాయి యంత్రాంగం కూడా తోడైంది. ప్రభుత్వ ఉద్యోగులు, బీడీ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ప్రచారం అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. దుబ్బాకలో తాము చాప కింద నీరులా చేసిన ప్రచారం కలిసి వస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితం సాధిస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

కాగా ఈ ఏడాది ఆగస్టు 6న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు.

Next Story

Most Viewed