మాకు హక్కులుండవా- వీఆర్‌వ్వోలు

by  |
మాకు హక్కులుండవా- వీఆర్‌వ్వోలు
X

దిశ, ఎల్బీనగర్: రాష్ట్రంలో వీఆర్వో పోస్ట్ రద్దయి ఏడాది గడుస్తున్నా వీఆర్వోలకు ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తుందని వీఆర్వోలు ఆరోపించారు. తమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం సంక్షేమం కోసం నియమ నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలకి ఒక హోదా కల్పించకుండా, జాబ్ చాట్ ఇవ్వకుండా సమస్యలను కనీసం వినడానికి కూడా తీరిక లేదని విమర్శించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని అన్నారు. ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా తదుపరి ప్రమోషన్ల కొరకు సర్వే ట్రైనింగ్‌కు పంపకుండా, కారుణ్య నియామకం చేపట్టకుండా మా హక్కులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల అభివృద్ధి కొరకు దళిత బంధు ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, బీసీ సామాజిక వర్గాలకు గేదెలు, గొర్లు ఇస్తూ వారి అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.

కానీ ఈ రాష్ట్రంలో 5,485 గ్రామ రెవెన్యూ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని, ఇందులో దాదాపుగా 95% శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారన్నారు. రెవెన్యూ ఉద్యోగులు కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రమోషన్లు కల్పించి, రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో భారీ ఆత్మగౌరవ సభను నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె పాటి నరేష్, సహా అధ్యక్షులు కందారి బిక్షపత, ఉపాధ్యక్షులు మౌలానా, రామేశ్వర రావు, ఆశన్న, రమేష్, రామ్ చందర్, రాజన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు


Next Story