మూసీ ప్రక్షాళన.. ఈ బడ్జెట్‌లోనైనా నిధులిస్తారా..?

by  |
మూసీ ప్రక్షాళన.. ఈ బడ్జెట్‌లోనైనా నిధులిస్తారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ ప్రక్షాళన. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికార పార్టీకి ఓ ప్రధాన అస్త్రం. ఆరేండ్లుగా ప్రక్షాళన నాయకుల మాటల్లో.. ప్రభుత్వ పత్రాల్లో తప్ప వాస్తవంలో కనిపించడం లేదు. మూసీనదికి పూర్వ వైభవం తెస్తామంటూ చెబుతున్న అధికార పార్టీ నాయకులు బడ్జెట్ కేటాయింపులు, నిధుల మంజూరులో మొండి చేయి చూపుతున్నారు. ఈ బడ్జెట్‌లోనైనా మూసీ ప్రక్షాళనకు కేటాయింపులు చేస్తారా లేదా చూడాలి మరీ.

ఆరేళ్లలో మూడు కోట్లు..

అధికార పార్టీ ప్రాధాన్యతల్లో మూసీ ప్రక్షాళన ఒకటి. మూసీ నదిపై ఆక్రమణలను తొలగించి, ప్రక్షాళన కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తరచుగా ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తున్నారు. అయితే ఆరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం రెండుసార్లు మాత్రమే నిధులను కేటాయించగా.. ఖర్చు చేసింది కేవలం మూడు కోట్లే. ఇంత తక్కువ నిధులతో మూసీ ప్రక్షాళన ఏ విధంగా సాధ్యపడుతుందో వారికే తెలియాలి. ఈ నెల 18న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారైనా మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేస్తుందా లేదోనన్నది ఆసక్తిగా మారింది.

కేటాయింపు ఇలా..

2014-19 మధ్య కాలంలో రాష్ట్ర బడ్జెట్ నుంచి 2017-18లో రూ.316 కోట్లు, 2018-19 కాలంలో రూ.377 కోట్ల కేటాయింపులు చేశారు. అయితే ఇదే కాలంలో ఖర్చు పరిశీలిస్తే 2014-17 వరకూ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కేటాయించలేదు.., మంజూరు చేయలేదు. ఇక 2017-18లో బడ్జెట్ కేటాయింపులు లేకపోయినా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో రూ.32.40 లక్షలు ఖర్చు చేశారు. 2018-19 కాలంలో కేవలం రూ. మూడు కోట్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. రూ.2.80 లక్షలను ఖర్చు చేశారు. ఈ నిధులతో హుస్సేన్ సాగర్ 57.5 కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటర్ వెడల్పుతో డ్రోన్ సర్వే చేసేందుకు ఓ కమిటీని నియమించారు.

ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి

మూసీ ప్రక్షాళనపై ఇప్పటికే అనేక కమిటీల నివేదికలు ఉన్నాయి. మళ్లీ కొత్తగా ఈ ఏడాది ఇంకో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదు. ఈ బడ్జెట్‌లోనైనా అవసరమైన స్థాయిలో నిధులను కేటాయించడంతో పాటు మంజూరు చేయాలి. – శ్రీనివాస్, సీపీఎం నాయకుడు, హైదరాబాద్


Next Story

Most Viewed