హైదరాబాద్ మెట్రో పాసుల జారీ ఎప్పుడు ?

by  |
హైదరాబాద్ మెట్రో పాసుల జారీ ఎప్పుడు ?
X

హైదరాబాద్‌లో మూడు మెట్రో కారిడార్లు ప్రారంభమై రైళ్లు పరిగెడుతున్నా పాస్‌‌ల జారీపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. 2017 ఏడాది చివర మొదటిసారి మెట్రో సర్వీసులను ప్రారంభించిన కొన్ని నెలలకే మెట్రో పాసులు వస్తున్నాయని ప్రచారం జరిగినా ఉత్తి మాటలుగానే మిగిలాయి. ఏడాదిన్నర క్రితం ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు మెట్రోను ప్రారంభించిన టైంలో కూడా పాస్‌ల జారీపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని ఆ నోటా ఈ నోటా వినపడినా కార్యరూపం దాల్చలేదు. ఇక మూడో మెట్రో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రారంభమైన మెట్రో పాస్‌ల వ్యవహారంపై యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

ప్రపంచ హంగులతో నిర్మించిన మన హైదరాబాద్ మెట్రో సర్వీసులు 69 కిలోమీటర్ల మేర నగరంలో పరుగుల పెడుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రోజుకు దాదాపుగా 4.50లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నా ఇప్పటివరకు మెట్రో పాసుల జారీ ఓ కొలిక్కి రాలేదు. మూడో కారిడార్ ప్రారంభానికి ముందే పాసులను జారీ చేసి ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని, అంతేగాక బస్సులు, మెట్రోలకు కలిపి కూడా ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరిగినా ఇంతవరకు క్లారిటీ రాలేదు. రోజుకు లక్షల మంది ప్రయాణం చేస్తూ పాస్‌ల కోసం ఎదురు చూస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం, మెట్రో యాజమాన్యం కానీ ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

దేశంలోనే అందరికంటే ఎక్కువగా మెట్రో ఛార్జీలను వసూలు చేస్తూ ప్రభుత్వం, యాజమాన్యం ఖజానాలో డబ్బులు వేసుకుంటున్నాయి తప్ప ప్రయాణికులు కోణంలో ఆలోచించిట్లేవన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మెట్రో పాసుల జారీ పలానా టైమ్‌లోగా ఉంటది ఆదిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ, యాజమాన్యం నుంచి రాకపోవడం గమనార్హం. మెట్రో పాస్‌లు లేకుండానే సర్వీసులను నడపాలని ప్రభుత్వం, యాజమాన్యం భావిస్తున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రకటన రాకపోవడంతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.


Next Story

Most Viewed